8న ఎమ్మెల్సీ అభ్యర్ధుల లిస్ట్...వారికి నో చాన్స్ ?
దాదాపుగా ఒక్కో సీటుకూ అయిదు నుంచి ఎనిమిది మంది వంతున పోటీలో ఉన్నారని అంటున్నారు.;
ఏపీలో ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ కూటమి అభ్యర్ధులను ఎంపిక చేసే పనిలో ఉంది. నిజానికి ఈ విషయంలో కత్తి మీద సాములాగానే ఉంది. పార్టీలో ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. పైగా మిత్రులు ఉన్నారు. ఉన్నవి అయిదే ఖాళీలు. దాదాపుగా ఒక్కో సీటుకూ అయిదు నుంచి ఎనిమిది మంది వంతున పోటీలో ఉన్నారని అంటున్నారు.
ఈ క్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా ఎవరిని ఎంపిక చేయాలన్నది టీడీపీ అధినాయకత్వానికి పరీక్షగానే ఉంది అని అంటున్నారు. అనెక సమీకరణలు రాజకీయ లెక్కలు కూడికలు, తీసివేతలు, వడపోతలు ఇలా ఎన్నో చూడాల్సి ఉందని అంటున్నారు.
ఇక చూస్తే కనుక ప్రస్తుతానికి రెండు పేర్లు ఖరారు అయినట్లే అని అంటున్నారు. అందులో ఒకటి జనసేన నుంచి నాగబాబుకు, మరొకటి పిఠాపురం వర్మకు అని ప్రచారం సాగుతోంది. మిగిలిన మూడింటి విషయంలో చాలా లెక్కలు తేలాల్సి ఉందిట. ఇదే సమయంలో ఈ మూడూ టీడీపీయే తీసుకోవాలని చూస్తోంది అని అంటున్నారు.
జనసేనకు ఒకటి ఇచ్చినా బీజేపీకి మరోసారి మొండి చేయి తప్పదని అంటున్నారు. రానున్న రోజులలో వైసీపీ నుంచి రాజీనామాలు చేసిన వారి ప్లేస్ లో భర్తీకి అవకాశాలు ఉంటే అపుడు చూడవచ్చు అన్నది చెప్పి వారిని ఒప్పిస్తారని అంటున్నారు బీజేపీలో పీవీఎన్ మాధవ్ కి ఎమ్మెల్సీ ఖరారు అయిందని వార్తలు వచ్చినా ఇపుడున్న టైట్ పొజిషన్ లో అడ్జస్ట్ చేయలేరని అంటున్నారుట.
మరి బీజేపీ పెద్దలు ఈ విషయంలో ఊరుకుంటారా అన్నది చూడాల్సి ఉంది. ఎందుకంటే గతంలో రెండు ఎమ్మెల్సీలు ఖాళీ అయితే అందులో చెరొకటీ జనసేన టీడీపీ తీసుకున్నాయి. ఈసారి కూడా ఆ రెండు పార్టీలే పంచుకుంటున్నాయి. దాంతో బీజేపీకి కూటమిలో తన వంతుగా ఒక్క ఎమ్మెల్సీ పదవి అయినా దక్కకపోవడం పట్ల ఏపీ బీజేపీ వర్గాలలో నిరాశ ఉంది అని అంటున్నారు.
కానీ టీడీపీలో చాలా మంది ఉండడంతో ఆ మూడు సీట్లను ఈసారికి తామే తీసుకోవాలని పసుపు పార్టీ చూస్తోందిట. ఇక వడపోతలు అన్నీ పూర్తి చేసి ఈ నెల 8న మొత్తం అభ్యర్థుల లిస్ట్ ని ప్రకటిస్తారు అని అంటున్నారు. చివరి నిముషంలో మార్పులు చేర్పులూ ఏమైనా లేకపోతే మాత్రం బీజేపీకి ఈ దఫా కూడా మొండి చేయి ఖాయమన్న మాట అయితే వినిపిస్తోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.