హిజబ్ పై పాట పాడిన సింగర్ కు 74 కొరడా దెబ్బలు
అయితే తాజాగా ఈ కేసుపై ఇరాన్ రివల్యూషనరీ కోర్టు తీర్పు వెలువరించింది. యర్రాహికి 74 కొరడా దెబ్బల శిక్ష విధించాలని ఆదేశించింది.;
ఇరాన్‌లో మరోసారి హిజాబ్ వివాదం చర్చనీయాంశంగా మారింది. 2023లో ప్రముఖ గాయకుడు మెహదీ యర్రాహి హిజాబ్‌కు వ్యతిరేకంగా ‘రూసారిటో’ (పర్షియన్ భాషలో మీ హెడ్‌స్కార్ఫ్) అనే పాటను విడుదల చేశారు. ఈ పాట ఇస్లామిక్ చట్టాన్ని వ్యతిరేకిస్తోందని భావించిన ఇరాన్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. కొద్ది కాలం తరువాత ఆయన విడుదలయ్యారు. అయితే తాజాగా ఈ కేసుపై ఇరాన్ రివల్యూషనరీ కోర్టు తీర్పు వెలువరించింది. యర్రాహికి 74 కొరడా దెబ్బల శిక్ష విధించాలని ఆదేశించింది.
హిజాబ్‌కు వ్యతిరేకంగా యర్రాహి పాట
2022లో ఇరాన్‌లో హిజాబ్ నిరసనలు ఉధృతంగా జరిగాయి. ఆ ఉద్యమానికి మద్దతుగా యర్రాహి తన ‘రూసారిటో’ పాటను విడుదల చేశారు. దానికి అరెస్ట్ అయ్యి ఏడాది తర్వాత విడుదలయ్యాడు. ఆ కేసులో తాజాగా అతడికి కోర్టు 74 కొరడా దెబ్బల శిక్ష విధించింది. ఈ శిక్షపై ఆయన స్పందిస్తూ "స్వేచ్ఛ కోసం మూల్యం చెల్లించడానికి నేను సిద్ధంగా ఉన్నాను" అంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
- హిజాబ్ నిరసనల నేపథ్యంలో ఉద్రిక్తతలు
1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత, ఇరాన్‌లో బహిరంగ ప్రదేశాల్లో మహిళలు హిజాబ్ ధరించడం తప్పనిసరి అయింది. అయితే అనేక మంది మహిళలు దీనిని వ్యతిరేకించుకుంటూ వచ్చారు. దేశంలోని పోలీస్ విభాగం హిజాబ్ నియమాల అమలును పర్యవేక్షిస్తోంది.
2022లో మాసా అమీ అనే యువతి హిజాబ్ సరైన విధంగా ధరించలేదన్న కారణంతో అరెస్ట్ అయ్యింది. పోలీస్ కస్టడీలో ఆమె మరణించడంతో ఇరాన్‌ను భారీ నిరసనలు కుదిపేశాయి. వేలాది మంది మహిళలు వీధుల్లోకి వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సమాజం కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. టెహ్రాన్ ప్రభుత్వం నిరసనకారులపై ఉక్కుపాదం మోపడంతో వివాదం మరింత ముదిరింది.