అంత భయమేలా 'మాధవా'?

ఆ భయంతో కూడిన ఆందోళననే ఏమో కానీ.. పోలీస్ విచారణకు రమ్మంటే స్వయంగా పోలీస్ అయినా ఓ మాజీ ఎంపీ భయపడిపోవడం హాట్ టాపిక్ గా మారింది.;

Update: 2025-03-06 16:07 GMT

పోలీస్ వారి ట్రీట్ మెంట్ ఎలాగుంటదో ఆయనకు బాగా తెలుసు.. ఇది వరకు చాలా మందికి ట్రీట్ మెంట్ ఇచ్చే ఉంటాడు. ఆ భయంతో కూడిన ఆందోళననే ఏమో కానీ.. పోలీస్ విచారణకు రమ్మంటే స్వయంగా పోలీస్ అయినా ఓ మాజీ ఎంపీ భయపడిపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఆయన వ్యవహరించిన తీరు ఇప్పుడు వైరల్ అయ్యింది.

పోలీసుల విచారణకు హాజరుకావడం సామాన్య ప్రజలకు ఎంతో భయానకంగా ఉంటుంది. పోలీస్ స్టేషన్ అంటేనే ఒక భయం, అందులోనూ విచారణ కోసం స్వయంగా అక్కడికి వెళ్లాలంటే ఆందోళన సహజం. పోలీసులు పిలిచినప్పుడు విచారణకు వెళ్లకపోతే ఏమవుతుందోనన్న ఆలోచన, వెళితే అక్కడ ఏం జరుగుతుందోనన్న అనుమానం చాలా మందిని కలవరపెడతాయి.

తాజాగా మాజీ ఎంపీ, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ స్థాయిలో పనిచేసిన గోరంట్ల మాధవ్ విచారణలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పోక్సో కేసులో బాధితుల వివరాలను బయటపెట్టారన్న ఆరోపణలతో మాధవ్‌పై రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, మాధవ్‌ను విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు పంపారు.

అసలు బుధవారమే విచారణకు రావాల్సిన మాధవ్, తనకు ఆ రోజున వీలు కాదని గురువారం వస్తానని ముందుగా సమాచారాన్ని అందించారు. దీనికి పోలీసులు కూడా అంగీకరించారు. చెప్పినట్టుగానే మాధవ్ గురువారం విజయవాడలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు విచారణ నిమిత్తం హాజరయ్యారు. అయితే, అక్కడ అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి.

మాధవ్ ఒంటరిగా విచారణకు రాలేదు. తన వెంట పది మంది లాయర్లను తీసుకువచ్చారు. అయితే, విచారణ సమయంలో కేవలం ఒక్క న్యాయవాదికి మాత్రమే అనుమతి ఇస్తామని పోలీసులు స్పష్టం చేశారు. దీనికి మాధవ్ ఏమాత్రం స్పందించకపోవడంతో, ఆయన వెంట వచ్చిన ఓ లాయర్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తనతో పాటు మిగతా లాయర్లందరినీ లోపలికి అనుమతించాల్సిందేనని వాదించారు.

అయితే, పోలీసుల కఠిన నిర్ణయంతో ఒక్క న్యాయవాదిని మాత్రమే అనుమతించి మాధవ్ విచారణకు హాజరయ్యారు. గతంలో పోలీసుగా పనిచేసిన మాధవ్‌కు, విచారణకు ఎంతమంది లాయర్లను అనుమతిస్తారన్న విషయం కూడా తెలియదా? ఆయన ఎంతో మందిని విచారించారు.. ఎందుకు భయపడుతున్నారనే డౌట్లు చాలా మందికి వచ్చాయి. ఈ ఘటన చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News