చడీ చప్పుడు లేని కాంగ్రెస్ కమిటీలు.. !
ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందంటే .. ఉంది.. లేదంటే లేదు! అన్నట్టుగా మారింది పరిస్థితి. ఒకవైపు తెలంగాణలో ఇంచార్జ్‌ని మార్చారు.;
ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందంటే .. ఉంది.. లేదంటే లేదు! అన్నట్టుగా మారింది పరిస్థితి. ఒకవైపు తెలంగాణలో ఇంచార్జ్‌ని మార్చారు. దీంతో పార్టీ పరుగులు పెడుతోంది. క్షేత్రస్థాయిలో పుంజుకునేందుకు కూడా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అంతేకాదు.. పదవులు.. పీఠాల విషయంలోనూ ఇంచార్జ్.. కీలక నిర్ణయం తీసుకున్నారు. కష్డపడుతున్న వారికే పదవులు ఇవ్వాలని నిర్ణయించారు. కేవలం సిఫార్సులు.. ఇతరత్రా కుల రాజకీయాలకు తెర దించారు.
దీంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకునే పరిస్థితికి వచ్చింది. కానీ, ఇదే సమయంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చూస్తే.. ఎక్కడా చడీ చప్పుడు కనిపించడం లేదు. ఎవరూ ముందుకు రావడం లేదు. అసలు నాయకులు ఎక్కడున్నారన్న ప్రశ్న కూడా ఉదయిస్తోంది. దీనికి కారణం.. ఏంటి? ఎందుకు? అంటే.. పార్టీ పరంగా కమిటీలను ఏర్పాటు చేయకపోవడమేనని అంటున్నారు. నిజానికి పార్టీ తరఫున ఎన్నికల అనంతరం కమిటీలు వేయాల్సి ఉంది.
కానీ. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క కమిటీని ఏర్పాటు చేయలేదు. పైగా.. నాయకులను కూడా ఎవరూ మాట్లాడొద్దన్న సంకేతాలు కూడా ఇచ్చారు. దీంతో నాయకులు కూడా.. మౌనంగా ఉన్నారు. ఒకరిద్దరు అయినా.. గతంలో ముందుకు వచ్చి మాట్లాడేవారు. కానీ... ఇప్పుడు ఎవరూ బయటకు రావడం లేదు. ఎవరి మానాన వారు ఉంటున్నారు. అసలు కొందరు సీనియర్ నాయకులు అయితే వారి వ్యాపారాలు వారు చేసుకుంటూ పిలిస్తేనే పలుకుతాం.. అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
దీంతో ఏపీ కాంగ్రెస్ పార్టీ అంటే.. కేవలం వైఎస్ షర్మిల అనే మాటే వినిపిస్తోంది. ఆమె తప్ప.. పార్టీలో స్పందించేవారు.. ప్రజల సమస్యలపై పట్టించుకునేవారు కూడా లేకుండా పోయారు. అంతేకాదు.. పార్టీ తరఫున కూడా వాయిస్ వినిపించేవారు కూడా లేకుండా ఉండడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ పుంజుకుంటుందా? లేక .. ఇలా నే ఉండిపోతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా కమిటీలను నియమిస్తే.. కొంత వరకు ప్రయోజనం ఉంటుందన్న సంకేతాలు వస్తున్నాయి.