మారిన సీన్.. ఐటీలో తగ్గిన బెంచ్ టైం
పేరుకు ఆకర్షణీయమైన జీతాలన్న మాటే కానీ తీవ్రమైన పని ఒత్తిడి ఐటీ ఉద్యోగాల్లో కనిపిస్తూ ఉంటుంది.;
పేరుకు ఆకర్షణీయమైన జీతాలన్న మాటే కానీ తీవ్రమైన పని ఒత్తిడి ఐటీ ఉద్యోగాల్లో కనిపిస్తూ ఉంటుంది. పైకి టిప్పుటాప్ గా కనిపించినప్పటికీ.. టార్గెట్ల కత్తుల్ని చుట్టూ పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. చేస్తున్న ప్రాజెక్టు పూర్తైనంతనే.. మరో ప్రాజెక్టు ఎప్పుడు చేతికి వస్తుందా? అన్న టెన్షన్ వెంటాడుతుంటుంది. టాలెంట్ ఎంత ఉన్నా.. అన్నీ అనుకున్నట్లు కుదరకపోతే.. బెంచ్ మీద కూర్చోవాల్సిందే. కొందరు దీన్ని ఎంజాయ్ చేసినట్లు కనిపించినా.. దీనికి మించిన నరకం మరేమీ ఉండదని చెబుతారు ఐటీ ఉద్యోగులు.
ఐటీ కంపెనీల్లో జాబ్ రావటం ఒక ఎత్తు అయితే.. ఏదో ఒక ప్రాజెక్టులోకి వెళ్లటం అన్నింటికి మించి ముఖ్యం. ఈ విషయంలో ఎలాంటి ప్రాజెక్టును కేటాయించని ఉద్యోగిని బెంచ్ మీద కూర్చోబెట్టినట్లుగా పేర్కొనటం తెలిసిందే. మరీ ఎక్కవ కాలం బెంచ్ మీద ఉంటే జాబ్ పోయే ఛాన్సు ఉంటుంది. సాధారణంగా కొత్తగా కంపెనీలో చేరిన ప్రతిఒక్కరు కొంతకాలం బెంచ్ మీద ఉండటం మామూలే.
కాకుంటే ఈ ఏడాదిన్నర కాలంలో ఈ బెంచ్ మీద ఉద్యోగుల్ని ఉంచే సరాసరి టైం తగ్గిన వైనం వెలుగు చూసింది. దేశీయంగా టీసీఎస్.. ఇన్ఫోసిస్.. విప్రో.. హెచ్ సీఎల్ టెక్.. అసెంచర్ లాంటి పెద్ద ఐటీ కంపెనీలు బెంచ్ పై ఉన్న ఉద్యోగుల సంఖ్యతో పాటు.. బెంచ్ పై సమయాన్ని తగ్గిస్తూ వస్తున్నాయి. దీనికి కారణం రెండేళ్లుగా భారీగీ రిక్రూట్ మెంట్లు జరపకపోవటం కూడా కారణం.
కొవిడ్ వేళ ఐటీ రంగానికి మంచి ఊపు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా డిజిటలీకరణ ఒక్కసారిగా షురూ కావటం తెలిసిందే. దీంతో భారీ ఎత్తున ప్రాజెక్టులు వచ్చాయి. ఐటీ కంపెనీల వ్రద్ధి రేటు సైతం రెండు అంకెల్లో ఉండేది. అప్పట్లో బెంచ్ సమయం 45-60 రోజులుగా ఉండేది. ప్రస్తుతం 35-45 రోజులకు పరిమితమైనట్లుగా చెబుతున్నారు. ఐటీ కంపెనీ మొత్తం సిబ్బందిలో బెంచ్ ఉద్యోగుల సగటు 10-15 శాతంగా ఉండగా.. ఇప్పుడది 2-5 శాతం మాత్రమేనని చెబుతున్నారు.
గతంలో కొత్తవారు మాత్రమే బెంచ్ మీద ఉండేవారు. ఇప్పుడు ఏఐ.. మెషీన్ లెర్నింగ్.. క్లౌడ్ ఫుణ్యమా అని సరికొత్త సాంకేతికత మీద పట్టు లేని సీనియర్లు సైతం బెంచ్ మీద ఉండాల్సి వస్తోంది. 9-14 ఏళ్ల అనుభవం ఉన్న వారు కూడా బెంచ్ లేఆఫ్ రిస్కును ఎదుర్కొంటున్నారు. 2022, 2023లో బెంచ్ మీద కూర్చునే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉండేదని చెబుతున్నారు. కరోనా వేళ భారీగా రిక్రూట్ మెంట్లు చేయటం.. ఆ తర్వాతి కాలంలో ప్రాజెక్టులు తగ్గటంతో సిబ్బంది వినియోగం తగ్గింది. దీంతో.. కంపెనీ ఆదాయాలు.. మార్జిన్ల మీద ఒత్తిడి పెరిగింది. దీంతో.. 2023 నుంచి రిక్రూట్ మెంట్ విషయంలో కంపెనీలు ఆచితూచి అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి.
అయితే.. టీసీఎస్.. ఇన్పోసిస్.. విప్రో.. హెచ్ సీఎల్.. అసెంచర్ లాంటి టైర్ 1 కంపెనీల్లో బెంచ్ మీద కాస్త ఎక్కువ మందే ఉన్నట్లు చెబుతున్నారు. క్లయింట్లు అడిగిన వెంటనే ప్రాజెక్టుల కోసం వీరిని ఉపయోగించుకుంటున్నారు. గతానికి భిన్నంగా ఇప్పుడు ఐటీ కంపెనీల వ్యాపారవ్యూహాల్లో మార్పులు వస్తున్నాయి. సగం ఉద్యోగులతో రెట్టింపు ఆదాయం వచ్చేలా పని చేయాలని తమ టీంలకు సవాలు ఇస్తున్నట్లు చెబుతున్నారు. కొన్ని కంపెనీలు అయితే తమ కంపెనీల్లో బెంచ్ కాన్సెప్టునే తీసేస్తున్నాయి. మొత్తంగా చూస్తే.. గతంతో పోలిస్తే ప్రస్తుతం బెంచ్ మీద ఉద్యోగుల్ని ఉంచే టైం అయితే తగ్గిందంటున్నారు. ఈ కబురు ఐటీ జీవులకు కాస్త ఉత్సాహాన్ని ఇచ్చేదిగా చెప్పక తప్పదు.