ఆదికి సెగ.. బీజేపీ నేతల ఉమ్మడి పోరాటం.. !
బీజేపీ సీనియర్ నాయకుడు, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డికి సొంత పార్టీలోనే వ్యతిరేకత పెరుగుతోంది.;
బీజేపీ సీనియర్ నాయకుడు, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డికి సొంత పార్టీలోనే వ్యతిరేకత పెరుగుతోంది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. ఏడుగురు కీలక నాయకులు పార్టీ అధిష్టానానికి లేఖ సమర్పించినట్టు ఆలస్యంగా వెలుగు చూసింది. సొంత పార్టీలోనే కీలక నాయకు లను పట్టించుకోకుండా.. సొంత వ్యాపారాలను చేసుకుంటూ.. పార్టీకి ఇబ్బందులు సృష్టిస్తున్నారని.. సదరు లేఖలో నాయకులు పేర్కొనడం మరింత వివాదంగా మారింది.
ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర బీజేపీలోనూ చర్చగా మారింది. జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ఆది గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఆయన ఇటు టీడీపీ నాయకుల తోనూ.. అటు బీజేపీ నేతలతోనూ వివాదాస్పదంగానే వ్యవహరిస్తున్నారన్నది వాస్తవం. ఫ్లై యాష్ వివాదంలో టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డితో వివాదానికి దిగిన ఆదినారాయణ రెడ్డి.. నేరుగా సీఎం చంద్రబాబు వద్ద పంచాయతీ పెట్టినా.. తన తీరు మార్చుకోలేదన్న విమర్శలు వున్నాయి.
ఇక, బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన కాంట్రాక్టు సంస్థకు జమ్మలమడుగులో పనులు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. దీనిపై నిరసనలు కూడా వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారం రాష్ట్ర స్థాయిలో వివాదానికి దారితీసింది. మరోవైపు .. ప్రజలను వదిలేసి.. తన ఆస్తులు పెంచుకుంటున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి కడప, అనంతపురం జిల్లాలకు చెందిన ఏడుగురు బీజేపీ నాయకులు ఆది కి వ్యతిరేకంగా.. అధిస్టానానికి లేఖ సంధించినట్టు తెలిసింది.
దీనిలో ఆది చేస్తున్న అక్రమాలు.. ఆయన పోగేసుకుంటున్న ఆస్తుల గురించి కూడా వివరించారు. అంతే కాదు.. ఆదిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా.. వారు డిమాండ్ చేయడం గమనార్హం. పార్టీలో ఎంతో మంది నికార్సయిన నాయకులు ఉన్నారని.. కానీ ఆది కారణంగా ఎవరూ పని చేయలేక పోతున్నా రని వారు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. అయితే.. ఈ వ్యవహారంపై రాష్ట్ర బీజేపీ నాయకులు మౌనంగా ఉన్నారు. దీనిపై ఏం జరుగుతుందో చూడాలి.