సడెన్ గా ‘బాబు’ బీఆర్ఎస్ కు ఎందుకు టార్గెట్ అయ్యారు?
బీఆర్ఎస్ పార్టీ మళ్లీ పక్క రాష్ట్రం సీఎం చంద్రబాబును తెరపైకి తీసుకొచ్చి టార్గెట్ చేసి సరికొత్త రాజకీయాన్ని వండివార్చుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.;
బీఆర్ఎస్ పార్టీ మళ్లీ పక్క రాష్ట్రం సీఎం చంద్రబాబును తెరపైకి తీసుకొచ్చి టార్గెట్ చేసి సరికొత్త రాజకీయాన్ని వండివార్చుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అసలు సంబంధం లేని బాబును వాడుకొని తెలంగాణలో మరోసారి మాటల మంటలు పుట్టించిందని అంటున్నారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి తెలంగాణ బీఆర్‌ఎస్ కు లక్ష్యంగా మారారు. చంద్రబాబుకు సవాల్ విసురుతూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నిజంగా తెలంగాణను ప్రేమిస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి న్యాయమైన వాటా తెచ్చిపెట్టాలని కోరారు.
"మీకు నిజంగా తెలంగాణపై ప్రేమ ఉంటే, సమ్మక్క సారక్క, వర్ధా, సీతమ్మసాగర్, కాళేశ్వరం మూడో ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులు తీసుకురండి" అని హరీశ్ రావు డిమాండ్ చేశారు. చంద్రబాబు కేంద్రం నుంచి ఈ అనుమతులు తీసుకొస్తేనే ఆయన తెలంగాణను ప్రేమిస్తున్నారని నమ్ముతామన్నారు. అప్పుడు మాత్రమే ఆయన "రెండు కళ్ళ సిద్ధాంతం" సత్యమేనని అంగీకరిస్తామని చెప్పారు.
చంద్రబాబు నాయుడు తెలంగాణకు ఏమీ చేయలేదని హరీశ్ రావు విమర్శించారు. గతంలో గోదావరి నదిలో తెలంగాణకు కేటాయించిన 969 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ అనుమతించాలన్నారు.
హరీశ్ రావు వ్యాఖ్యలు ఆశ్చర్యకరమైనవి కాకపోయినా, వాటి సమయమే ఆశ్చర్యానికి కారణమవుతోంది. ప్రస్తుతం ఏపీ-తెలంగాణ మధ్య రాజకీయ అంశాలు లేనప్పుడు చంద్రబాబును టార్గెట్ చేయడం ఎందుకు? అన్నది రాష్ట్ర రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. బీఆర్‌ఎస్‌కు దీనివల్ల మళ్లీ ప్రాంతీయ విద్వేశాలు రెచ్చగొట్టి లబ్ధిపొందే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. ఒకవైపు తెలంగాణ హక్కుల కోసం తాము పోరాడే ఏకైక పార్టీగా ప్రచారం చేసుకోవచ్చు, మరోవైపు తెలంగాణ భావోద్వేగాన్ని మళ్లీ రేకెత్తించవచ్చన్న ప్లాన్ ను తెరపైకి తెచ్చి ఉంటారని విశ్లేషకులుు అంచనా వేస్తున్నారు.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, దీనివల్ల బీఆర్‌ఎస్ మిత్రపక్షం అయిన వైఎస్ జగన్‌కు లాభం కలుగుతుంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్‌ఎస్ పెద్దగా ఇలాంటి అంశాలు లేవనెత్తలేదు. కానీ చంద్రబాబు ఏపీలోనూ, కేంద్రంలోనూ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ వైఖరి మారడంతో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.