కలలోనూ నా భార్య వెంటాడుతోంది.. అధికారులకు పోలీసు రిప్లై
యూపీలోని మీరట్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం సంచలనంగా మారింది. ప్రావిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ విభాగానికి చెందిన ఒక కానిస్టేబుల్ కు ఇటీవల ఉన్నతాధికారులు క్రమశిక్షణా చర్యల నోటీసు జారీ చేశారు.;
విధులు సరిగా నిర్వహించటం లేదన్న ఆరోపణపై పోలీసు ఉన్నతాధికారులు ఇచ్చిన నోటీసుకు ఒక కానిస్టేబుల్ ఇచ్చిన రిప్లై.. సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావటం.. అది కాస్తా వైరల్ గా మారింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక కానిస్టేబుల్ తాను విధి నిర్వహణను సరిగా చేపట్టకపోవటానికి కారణం తన భార్యతో తనకున్న గొడవలేనని పేర్కొన్నారు. తన భార్య తనను కలలో కూడా వెంటాడుతోందని.. అందుకు రాత్రిళ్లు నిద్ర కూడా పట్టటం లేదన్నారు. ఈ కారణంతోనే విధులకు సరిగా హాజరు కాలేకపోతున్నట్లుగా చెప్పారు.
యూపీలోని మీరట్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం సంచలనంగా మారింది. ప్రావిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ విభాగానికి చెందిన ఒక కానిస్టేబుల్ కు ఇటీవల ఉన్నతాధికారులు క్రమశిక్షణా చర్యల నోటీసు జారీ చేశారు. విధులకు ఆలస్యంగా రావటం.. సరిగా యూనిఫాం ధరించకపోవటం.. యూనిట్ కార్యక్రమాలకు సరిగా హాజరు కాకపోవటంతో అతడిపై చర్యలకు వీలుగా నోటీసు జారీ చేసి వివరణ కోరారు.
దీనికి ప్రతిగా ఆ కానిస్టేబుల్ సమాధానం ఇస్తూ.. వైవాహిక జీవితంలో ఉన్న విభేదాల కారణంగా తాను నిద్ర లేమితో బాధ పడుతున్నట్లుగా పేర్కొన్నారు. కలలో తన భార్య తనను వెంటాడుతోందని.. తన ఛాతీపై కూర్చొని తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ కారణంగా రాత్రిళ్లు నిద్ర పోకుండా మేలుకవతో ఉంటున్నానని.. అందుకే విధులకు ఆలస్యంగా వస్తున్నట్లు చెప్పారు. తీవ్ర కుంగుబాటు సమస్యతో బాధ పడుతున్నట్లుగా పేర్కొన్న అతను.. తనకు జీవించాలనే కోరిక లేదన్నారు. ఆధ్యాత్మికం వైపు వెళ్లేందుకు సాయం చేయాలని అధికారుల్ని కోరారు.
ఉన్నతాధికారులకు ఇచ్చిన రిప్లై లేఖ.. సోషల్ మీడియాలో పోస్టు కావటం సంచలనంగా మారింది. ఈ లేఖ వైరల్ కావటంతో ఉన్నతాధికారులు ఈ అంశంపై విచారణ చేపట్టారు. ఈ లేఖ సోషల్ మీడియాలోకి ఎలా వచ్చిందన్న అంశంపై ఆరా తీస్తున్నట్లుగా పీఏసీ 44వ బెటాలియన్ కమాండెంట్ సచింద్ర పటేల్ వెల్లడించారు. సంచలనంగా మారిన ఈ ఉదంతంలో సదరు పోలీస్ కానిస్టేబుల్ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.