జగన్ వర్సెస్ పవన్...ఏపీలో సీన్ రిపీట్ !
ఈ మూడు పార్టీలు విడిగా పోటీ చేస్తే వైసీపీకి మేలు అన్నది 2019 ఎన్నికలు తేటతెల్లం చేశాయి.;
ఏపీలో మూడు ప్రాంతీయ పార్టీల వ్యవస్థ దిశగా రాజకీయం సాగుతోంది. ఇందులో తెలుగుదేశం పార్టీది సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర. వైసీపీ జనసేన ఇంచుమించుగా ఒకేసారి ఆవిర్భవించాయి. వైసీపీ అయితే అధికారాన్ని అందుకుంది. జనసేన వెయిటింగ్ లిస్ట్ లో ఉంది. ఈ మూడు పార్టీలు విడిగా పోటీ చేస్తే వైసీపీకి మేలు అన్నది 2019 ఎన్నికలు తేటతెల్లం చేశాయి.
టీడీపీ జనసేన కలిస్తే వైసీపీకి చేటు అన్నది 2024 ఎన్నికలు కళ్ళకు కట్టి మరీ చూపించాయి. వైసీపీ జనసేనను టార్గెట్ చేయడం వల్లనే చాలా సులువుగా టీడీపీ జనసేన కలిసిపోయాయని కూడా పొలిటికల్ పండిట్స్ అభిప్రాయపడ్డారు. ఇక ఓటమి తరువాత వైసీపీ టీడీపీనే టార్గెట్ చేస్తూ వచ్చింది. జనసేనను పక్కన పెట్టింది.
కానీ లేటెస్ట్ గా చూస్తే జనసేనను వైసీపీ మళ్ళీ టార్గెట్ చేస్తోంది. పైగా పవన్ ని కూడా విమర్శిస్తున్నారు. అయితే పవన్ వైసీపీని విమర్శించలేదా అని అడగవచ్చు. కానీ రాజకీయంగా వ్యూహాత్మకంగా ఆలోచిస్తే పవన్ వైసీపీని విమర్శించినా వైసీపీ నుంచి పవన్ ని విమర్శించకపోవడమే ఆ పార్టీకి మేలు అని అంటున్నారు.
కానీ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ అయితే తాజాగా పవన్ మీద హాట్ కామెంట్స్ చేశారు. ఆయన స్థాయి కార్పోరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ అని విమర్శించారు. దీంతో రాజకీయ రచ్చ మళ్ళీ రాజుకుంది. పవన్ ని విమర్శించడం అంటే ఆయన వెనకాల ఉన్న బలమైన సామాజిక వర్గాన్ని కూడా టార్గెట్ చేయడమే అని వైసీపీ మరచిపోతోంది అంటున్నారు.
నిజానికి చూస్తే కూటమిలో జనసేన టీడీపీల మధ్య పొరపొచ్చాలు ఉన్నాయని ప్రచారంలో ఉంది. గ్రౌండ్ లెవెల్ లో కూడా రెండు పార్టీల క్యాడర్ మధ్యన గ్యాప్ ఉంది. పోటా పోటీగా కొన్ని చోట్ల ఉంది. ఈ క్రమంలో అయిదేళ్ళ తరువాత ఎన్నికల్లో ఏమైనా జరగవచ్చు. రాజకీయాల్లో ఎన్నో అవకాశాలు ఉంటాయి.
కానీ వైసీపీ టీడీపీతో పాటు జనసేనను కలిపి కట్టి విమర్శించడం రాజకీయంగా తప్పుడు వ్యూహమే అని అంటున్నారు. ఇలా చేయడం వల్ల మళ్ళీ క్షేత్ర స్థాయిలో రెండు పార్టీలు ఒక్కటి కావడానికి చాన్స్ ఉంటుందని అలాగే సామాజిక రాజకీయ పరమైన పోలరైజేషన్ కోస్తా జిల్లాలలో మరింత బలంగా సాగుతుందని అది అంతిమంగా వైసీపీకే దెబ్బ అని అంటున్నారు.
ఇదిలా ఉంటే జగన్ పవన్ ని విమర్శించగానే మంత్రి నారా లోకేష్ అందుకుని ఉప ముఖ్యమంత్రిని కించపరుస్తారా అని గట్టిగా జగన్ మీద విరుచుకుపడడాన్ని గమనించాల్సి ఉంది. జగన్ పార్టీ కంటే పవన్ కి సీట్లు మెజారిటీలు ఎక్కువ వచ్చాయని ఆయన లెక్క చెప్పారు. పవన్ ని విమర్శించారు అని వైసీపీని కౌంటర్ చేస్తూ జనసేనను వెనకేసుకుని రావడం ద్వారా టీడీపీ జనసేనను తమతోనే ఉంచుకుంటోంది.
మరి వైసీపీ పెద్దలు ఈ విషయంలో కాస్తా నిదానంగా ఆలోచిస్తే బాగుంటుంది కదా అని అంటున్నారు. పవన్ ని ఒక బలమైన సామాజిక వర్గం తమ ప్రతినిధిగా చూస్తోంది. అలాగే ప్రాంతాలు కులాలు మతాలతో సంబంధం లేకుండా యువత మహిళలలో పవన్ కి క్రేజ్ ఉంది. దాంతో ఆయనను విమర్శించడం ద్వారా వైసీపీ రాజకీయంగా లాభం సంగతేమో కానీ నష్టమే పొందుతుందని అంటున్నారు.