ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్ల సిత్రాలు తెలిస్తే నోట మాట రాదంతే

తాజా ఓట్ల లెక్కింపులో జరిగినదేమంటే.. చాలామంది ఒకటో నెంబరును ఇద్దరికి కేటాయించారు. కొందరు ఒకటో నెంబరును వేయకుండా మిగిలిన నెంబర్లు వేశారు.;

Update: 2025-03-06 05:42 GMT

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు రోజులు. సోమవారం ఉదయం ఆరు గంటలకు మొదలైన ఓట్ల లెక్కింపు నాన్ స్టాప్ గా సాగుతూ బుధవారం రాత్రి తొమ్మిది గంటలకు పూర్తైంది. ఇదంతా మెదక్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ - కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికలో బీజేపీ అభ్యర్థి గెలుపొందగా.. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమి చెందటం తెలిసిందే. గెలిచిన బీజేపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 5106 కాగా.. అందుకు ఐదు రెట్ల కంటే ఎక్కువగా చెల్లని ఓట్లు పోల్ కావటం.. తుది ఫలితం మీద ప్రభావాన్ని చూపినట్లుగా చెబుతున్నారు.

మొత్తం 2,52,029 మంది పట్టభద్రులు ఓటుహక్కును వినియోగించుకోగా అందులో 11.38 శాతం ఓట్లు చెల్లలేదు. ఎందుకిలా? కనీసం డిగ్రీ చదివితేనే ఈ ఎన్నికల్లో ఓటు వేసే హక్కు వస్తుంది. అలాంటప్పుడు డిగ్రీ.. అంతకు పై చదువులు చదివిన వారికి ఓటు వేయటం కూడా రాదా? అన్నది ప్రశ్నగా మారింది. ఈ ఎన్నికల్లో ఓటర్లు చేసిన తప్పులు చూస్తే.. ఎంతో సిల్లీగా కనిపిస్తాయి.

ఈ ఎన్నికల్లో ప్రాధాన్యత ప్రకారం ఓటు వేయొచ్చు. తమకు నచ్చిన ఒక వ్యక్తికి అయినా ఓటు వేయొచ్చు. లేదంటే.. బరిలో ఉన్న అందరు అభ్యర్థులకు ఓటు వేయొచ్చు. కానీ.. వారికి వరుస నెంబర్లతో ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒకటో నెంబరు ఒక అభ్యర్థికి ఇచ్చిన తర్వాత నచ్చితే 2, 3, 4, 5 చొప్పున బరిలో ఉన్న అందరికి తమ ప్రాధాన్యత ఇవ్వొచ్చు. ఇక్కడ మర్చిపోకూడని అసలు విషయం ఏమంటే.. ఒకటోనెంబరు ఇచ్చిన తర్వాతే ఈ నెంబర్లు ఇవ్వాలి. అంతేకాదు.. 2, 3, 4 నెంబర్లు ఇస్తే.. ఆ ఓటు చెల్లదు. కారణం.. ఒకటో ప్రాధాన్యత ఏమిటో పేర్కొనకపోవటమే దీనికి కారణం.

తాజా ఓట్ల లెక్కింపులో జరిగినదేమంటే.. చాలామంది ఒకటో నెంబరును ఇద్దరికి కేటాయించారు. కొందరు ఒకటో నెంబరును వేయకుండా మిగిలిన నెంబర్లు వేశారు. కొందరు నెంబర్లు వేయకుండా తమకు నచ్చిన అభ్యర్థి ఎదుట టిక్ పెట్టారు. కొందరు అభ్యర్థి పక్కన ఉండే వరుస సంఖ్యకు రౌండ్ చుట్టారు. కొందరు తమకు నచ్చిన అభ్యర్థి ఎదుట ఓకే అని రాశారు.

ఇలాంటి పనులతో పాటు.. మరో సిత్రమైన పని చేశారు. అదేమంటే.. నచ్చిన అభ్యర్థి పక్కన నెంబరు వేసి.. సంతకాలు చేయటంతో పాటు తమ పేర్లు కూడా రాసేసి తమ విధేయతను చాటుకున్నారు. కానీ.. ఆ ఓట్లు మొత్తం చెల్లలేదు. ఇంకొందరు ఎన్నికల సిబ్బంది ఇచ్చిన ఊదా రంగు పెన్నుతో ఓటు వేయాల్సి ఉన్నా.. తమ సొంత పెన్నుతో ఓటు వేయటంతో ఆ ఓట్లు కూడా చెల్లలేదు. ఓటర్లు అంతా గ్రాడ్యుయేట్లు అయినప్పటికి ఓటు ఎలా వేయాలన్న అంశంపై అవగాహన లేనట్లుగా వ్యవహరించిన వైనం.. గెలుపోటముల్ని డిసైడ్ చేసిందని చెప్పాలి.

Tags:    

Similar News