ఆపరేషన్ ఆకర్ష్... జనసేన పక్కా వ్యూహం.. !
ఆపరేషన్ ఆకర్ష్.. రాజకీయాల్లో తరచుగా వినిపించే మాట.. నాయకుల నోటి నుంచి తరచుగా వినబడే మాట కూడా.;
ఆపరేషన్ ఆకర్ష్.. రాజకీయాల్లో తరచుగా వినిపించే మాట.. నాయకుల నోటి నుంచి తరచుగా వినబడే మాట కూడా. పాలిటిక్స్‌లో ఇది కామనే. పైగా.. ప్రత్యర్థి పార్టీలను లైన్‌లో పెట్టుకునేందుకు.. వాటి బలాన్ని తగ్గించేందుకు కూడా.. ఆపరేషన్ ఆకర్ష్ మంత్రం పార్టీలకు కామన్‌గా మారిపోయింది. ఇప్పుడు ఈ మంత్రాన్నే జనసేన పార్టీ కూడా పఠిస్తోంది. పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. చాలా మంది తటస్థ నాయకుల నుంచి.. టీడీపీలోకి, బీజేపీలోకి చేరేందుకు ఇష్టపడి నాయకులు ఉన్నారు.
ఇలాంటివారు.. ప్రత్యామ్నాయంగా జనసేనవైపు చూస్తున్నారన్నది కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చ. ఇప్పు డు ఇలాంటి వారిని పిలిచి మరీ పార్టీలో చేర్చుకునేందుకు జనసేన పక్కా వ్యూహం రెడీ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 14న జనసేన ఆవిర్భావ సభను ఏర్పాటు చేస్తున్నారు. నేరుగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. సొంత నియోజకవర్గం పిటాపురంలోని చిత్రాడి ప్రాంతంలో నిర్వహిస్తున్న ఈ ఆవిర్భావ సభ వేదికగా సుమారు 10 మంది వరకు నాయకులను పార్టీలో చేర్చుకునే అవకాశం ఉందన్న సంకేతాలు వస్తున్నాయి.
వీరిలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే. వైసీపీ నాయకుడు పెండెం దొరబాబు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈయనతోపాటు.. గాజువాక మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు తిప్పలనాగిరెడ్డి, ఆయన తనయుడు కూడా చేరుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇక, గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు మేకతోటి సుచరిత కూడా.. జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం. అలానే.. విజయవాడకు చెందిన మరో వైసీపీ నాయకుడు కూడా జంప్ చేస్తారన్న ప్రచారం ఉంది. అలాగే.. ఓ కీలక మహిళా నేత, కాపు సామాజిక వర్గానికి చెందిన వైసీపీ మాజీ నాయకురాలు కూడా.. జనసేన తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది.
ఇలా.. కీలకమైన 10 మంది నాయకుల వరకు .. జనసేన తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయినట్టు సమా చారం. వీరందరికీ ఆవిర్భావ సభా వేదికగా.. పవన్ కల్యాణ్ కండువా కప్పుతారన్న చర్చ జరుగుతోంది. ఆయా నాయకులతో ఇప్పటికేమాటా మంతీ కూడా అయిపోయిందని.. కేవలం కండువాకప్పడమే తరువాయని అంటున్నారు. ఇదే జరిగితే.. వైసీపికి భారీ ఎదురు దెబ్బ తగులుతుందనడంలో సందేహం లేదని తెలుస్తోంది.