బీజేపీని ఎలా నమ్మాలి బాబూ.. !
బీజేపీని ఎలా నమ్మాలి? ఇదీ.. ఇప్పుడు కూటమిలోని టీడీపీ నాయకులు సంధిస్తున్న అంతర్గత ప్రశ్న.;
బీజేపీని ఎలా నమ్మాలి? ఇదీ.. ఇప్పుడు కూటమిలోని టీడీపీ నాయకులు సంధిస్తున్న అంతర్గత ప్రశ్న. కూటమిలో ఉంటూ.. మంత్రి పదవి తీసుకుని.. సర్కారులోనూ చక్రం తిప్పుతున్న పార్టీ.. కూటమికే.. ద్రోహం చేసేలా.. వ్యవహరించిందన్న వాదన అంతర్గత చర్చల్లో జోరుగా వినిపిస్తోంది. దీనికి కారణం.. ఉత్తరాంధ్రలో కూటమి పార్టీలు మద్దతిచ్చిన పాకాలపాటి రఘువర్మ ఓడిపోవడం. ఇదేసమయంలో బీజేపీ నాయకులు క్షేత్రస్థాయిలో మద్దతు ప్రకటించిన గాదె శ్రీనివాసుల నాయుడు విజయం దక్కించుకోవడం.
ఇదేమీ చాలా చిన్న విషయం అని అనుకుంటే పొరపాటే. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం దక్కించు కున్నాం కాబట్టి.. ఒకటి పోయినా ఫర్వాలేదని అనుకుంటే.. కూడా ఇబ్బందే. ఎందుకంటే.. ఇది ఎన్నికల కు మాత్రమే సంబంధించిన విషయం కాదు. రాజకీయంగా.. కూటమి పార్టీల మధ్య కలివిడి తనానికి.. పట్టుకు సంబంధించిన వ్యవహారం. ప్రాంతాల వారీగా రాజకీయాలు చేసుకుంటూ.. పోతే.. రేపు మరో ఎన్నిక వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? ఇలానే వ్యవహరిస్తారా? అన్నది ప్రశ్న.
ఎందుకంటే.. కూటమిగా ఉండి.. గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. వైసీపీ కంచుకోటలోనూ బీజేపీ విజయం దక్కించుకుందంటే.. దీనికి టీడీపీ మద్దతు కారణం. అలాంటి కూటమిలో సొంత నిర్ణ యం తీసుకుని ఉత్తరాంధ్రలో గాదెకు మద్దతు ఇచ్చారు. ఈ విషయం తెలిసి కూడా.. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కానీ.. రాష్ట్ర పార్టీ చీఫ్ పురందేశ్వరి కానీ.. ఎక్కడా ఎవరినీ వారించలేదు. ఇలా చేయడం కూటమికి ద్రోహమని కూడా భావించలేదు.
దీంతో క్షేత్రస్థాయి నాయకులు.. తమ ఇష్టానుసారంగానే వ్యవహరించారు. ఇది టీడీపీ మద్దతు ప్రకటించి న రఘువర్మను చిత్తుగా ఓడించింది. ఇతర కారణాలు ఉన్నప్పటికీ.. బలమైన మద్దతు విషయంలో పైకి ఒక విధంగా అంతర్గతంగా మరో విధంగా వ్యవహరించడంతోనే ఇలా జరిగిందన్నది వాస్తవం. సో.. ఇలాంటి కారణాలే.. పొత్తును రేపు ప్రభావితం చేసే అవకాశం మెండుగా కనిపిస్తోంది. కాబట్టి.. ఇప్పటికైనా.. ఇలాంటి సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాల్సి న అవసరం.. కలివిడిగా ఉండాల్సిన అవసరం ఉంది.