అసెంబ్లీ ఎన్నికల బరిలో ప్రముఖ నటుడు.. ఏ పార్టీలోకి అంటే?

ఈ విషయమై తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతం సినిమా ప్రమోషన్ కోసం బిజీగా ఉన్నానని ఆయన తెలిపారు.;

Update: 2025-03-05 17:31 GMT

భోజ్‌పురి సినీ నటుడు, గాయకుడు పవన్ సింగ్ ఈ ఏడాది చివర్లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. బీజేపీ తరఫున బరిలో దిగే అవకాశంపై ప్రశ్నించగా, "కాలమే సమాధానం చెబుతుంది" అని వ్యాఖ్యానించారు. ఈ విషయమై తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతం సినిమా ప్రమోషన్ కోసం బిజీగా ఉన్నానని ఆయన తెలిపారు.

- బీజేపీ నుంచి బహిష్కరణ

గత ఏడాది మేలో బీజేపీ అధిష్ఠానం పవన్ సింగ్‌ను పార్టీ నుంచి తొలగించింది. కారాకాట్ లోక్‌సభ నియోజకవర్గానికి ఎన్డీయే అభ్యర్థిని ప్రకటించాక, ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు. దీనితో పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారనే కారణంతో బీజేపీ నుంచి అతనిని బహిష్కరించారు.

-కోట్లాది ఆస్తుల వివరాలు

ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. పవన్ సింగ్ వద్ద రూ.16.75 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. వీటిలో రూ.11.70 కోట్లు స్థిరాస్తులు కాగా, రూ.5.04 కోట్లు చరాస్తులు ఉన్నాయి. బ్యాంకు ఖాతాలు, మూడు కార్లు, మోటార్‌సైకిల్, నగలు, రూ.60,000 నగదు కూడా ఆయన వద్ద ఉన్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆయన ఆదాయం రూ.51.84 లక్షలుగా నమోదైంది.

ఇదిలా ఉండగా, పవన్ సింగ్ భార్య జ్యోతి సింగ్ కూడా రోహటాస్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్-నవంబర్‌లో జరగనున్నాయి.

Tags:    

Similar News