అమరావతిపై మళ్లీ అదే మాట.. ఈ సారి కాస్త గట్టిగా.. వైసీపీపై మంత్రుల ఫైర్

అమరావతి నిర్మాణం తమకు అంగీకారం కాదన్న ఎమ్మెల్సీ రవీంద్రబాబు.. అమరావతిని ఘోస్ట్ సిటీగా అభివర్ణించారు.;

Update: 2025-03-05 14:20 GMT

రాజధాని అమరావతిపై వైసీపీ మరోమారు తన స్టాండ్ ఏంటో చెప్పేసింది. గతంలో తాము మూడు రాజధానుల స్టాండ్ తీసుకున్నామని, ఇప్పుడు ఏ వైఖరి తీసుకోవాలో పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించిన రెండో రోజే ఆ పార్టీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు కుండబద్ధలు కొట్టేశారు. అమరావతి నిర్మాణం తమకు అంగీకారం కాదన్న ఎమ్మెల్సీ రవీంద్రబాబు.. అమరావతిని ఘోస్ట్ సిటీగా అభివర్ణించారు. దీంతో మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారిథి ఫైర్ అయ్యారు.

రాజధాని అమరావతిపై శాసనమండలిలో మరోమారు రచ్చ చోటు చేసుకుంది. బడ్జెట్ పై చర్చ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అమరావతి నిర్మాణంపై తమకు అభ్యంతరాలు ఉన్నాయన్న ఆయన బర్మా దేశం గతంలో రాజధాని నిర్మించుకుందని, అయితే ప్రస్తుతం అక్కడ భవనాలు తప్ప మనుషులు లేరని చెప్పారు. ప్రస్తుతం బర్మా రాజధానిని ఘోస్ట్ సిటీగా పిలుస్తారని చెప్పారు. రాజధాని అమరావతిలో కూడా అదే జరుగుతుందన్నట్లు ఎమ్మెల్సీ వ్యాఖ్యలు చేశారు. అమరావతికి ఉన్న రవాణా సౌకర్యాలు ఏంటని ప్రశ్నించిన ఆయన పారిశ్రామిక వేత్తలు ఎవరైనా వస్తారా? అంటూ సందేహాలు వ్యక్తం చేశారు. దీంతో సభలోనే ఉన్న మంత్రులు అచ్చెన్నాయుడు, రవీంద్ర, పార్థసారథి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజధానిపై వైసీపీ ఇప్పటికీ విషం చిమ్ముతోందని ఆరోపించారు.

‘‘ఆంధ్రప్రదేశ్ మధ్యలో రాజధాని అమరావతి నగరం ఉంటుందని కొందరు చెబుతున్నారు. ఆస్ట్రిచ్ పక్షిలాగా ఎందుకు లేనిపోనివన్నీ పెట్టుకుంటారు. అమరావతి నగరాన్ని కట్టలేరు. అది సాధ్యం కాదు. నగరాలను నిర్మించలేం, వాటంతట అవే అభివృద్ధి చెందాలి. అమరావతి అనేది ఇటుకలు, సిమెంటుతో కట్టేది కాదు. కొత్తగా నగరాలను కట్టడం అనేది సాధ్యం కాదు. ఒకప్పుడు బర్మా దేశం క్యాపిటల్ కట్టుకుంది. ఇప్పుడు అక్కడ బిల్డింగులే తప్ప మనుషులు లేరు. బర్మా దేశం రాజధానిని ఘోస్ట్ సిటీ అంటున్నారు. మాకు (వైసీపీ) అమరావతి రాజధానిగా అంగీకారం కాదు. అమరావతికి ఎవరైనా పారిశ్రామికవేత్తలు వస్తారా? రాజధాని వల్ల ఉపాధి, ఉద్యోగాల కల్పన సాధ్యం కాదు. హైవేలు, రన్ వేలు, రోడ్ వే, వాటర్ వే ఉన్నాయా?’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు.

రాజధాని అమరావతిపై వైసీపీ ఎమ్మెల్సీల వ్యాఖ్యలకు సభలోనే ఉన్న మంతరులు కొల్లు రవీంద్ర, పార్థసారథి, అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని కోసం మాట్లాడే అర్హత వైసీపీ సభ్యులకు లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజలు రాజధానిపై స్పష్టమైన తీర్పు ఇచ్చారని చెప్పిన మంత్రులు, మూడు రాజధానులు అన్న వైసీపీకి ఎలాంటి ఫలితాలు ఎదురయ్యాయో తెలుసుకుని మాట్లాడాలని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం రాజధానిని అద్భుతంగా నిర్మిస్తుందని, సీఎం చంద్రబాబు విజన్ ఎలా ఉంటుందో తాము చూపిస్తామని మంత్రులు వైసీపీ ఎమ్మెల్సీకి కౌంటర్ ఇచ్చారు.

Tags:    

Similar News