పన్నుకు 'పన్ను'.. ట్రంప్ ట్రేడ్ వార్..ఎంతకైనా సిద్ధం..డ్రాగన్ గర్జన

ఉక్రెయిన్-రష్యా, ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం కంటే ఈ ట్రేడ్ వార్ మున్ముందు మరింత చర్చనీయంగా మారే అవకాశమూ లేకపోలేదు.;

Update: 2025-03-05 14:30 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలుపెట్టిన ట్రేడ్ వార్.. ఎంతవరకు వెళ్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు.. కెనడా, యూరప్, చైనా మీదుగా భారత్ నూ తాకే ఈ ట్రేడ్ వార్ ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఉక్రెయిన్-రష్యా, ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం కంటే ఈ ట్రేడ్ వార్ మున్ముందు మరింత చర్చనీయంగా మారే అవకాశమూ లేకపోలేదు.

అయితే, అమెరికా మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధాన్ని దీటుగా ఎదుర్కొనేదెవరు..? చివరివరకు పోరాడేది ఎవరు..? కెనడాలో నాయకత్వ మార్పు జరుగుతోంది.. యూరప్ దేశాలు ఎంతవరకు నిలుస్తాయో తెలియదు.. ఈ నేపథ్యంలో అమెరికాను ఢీ కొట్టేది డ్రాగన్ దేశం చైనానే అని చెప్పక తప్పదు.

తమ దేశ దిగుమతులపై 20 శాతం సుంకాలు విధిస్తూ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంపై చైనా స్పందించింది. ఈ వాణిజ్య యుద్ధంలో చివరివరకు పోరాడతామని తెలిపింది. అమెరికా.. నువ్ మాతో యుద్ధానికి (ట్రేడ్ వార్) సిద్ధపడితే.. అది సుంకాల యుద్ధమైనా, వాణిజ్య యుద్ధమైనా మరే రకమైన యుద్ధమైనా చివరివరకు పోరాడడానికి మేం సిద్ధం అని అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం ప్రకటించింది. తమపై టారిఫ్‌ లకు ప్రతిగా అమెరికా ఉత్పత్తులపై తామూ 10-15 శాతం టారిఫ్ లు వేస్తామని ప్రకటించింది.

మంటపెట్టిన ఫెంటనిల్..

ఫెంటనిల్.. ఇప్పుడీ డ్రగ్ అమెరికా-చైనా మధ్య చిచ్చుపెడుతోంది. ఫెంటనిల్‌ అక్రమ రవాణాను అడ్డుకోవడంలో చైనా విఫలమైనందునే టారిఫ్‌ లను రెట్టింపు చేస్తున్నట్లు ట్రంప్‌ పేర్కొంటున్నారు. అందుకే దీనిని ఫెంటనిల్‌ సంక్షోభం అని.. ఇది అమెరికా చేసుకున్నదే అని డ్రాగన్‌ ఆరోపించింది. ఫెంటనిల్ అక్రమ రవాణాను అడ్డుకోవడానికి తాము చేస్తున్న ప్రయత్నాలను గుర్తించకుండా అమెరికా తిరిగి తమనే నిందిస్తోందని తప్పుబడుతోంది. టారిఫ్ ల పేరుతో ఒత్తిడి చేసి.. బ్లాక్‌ మెయిల్‌ కు ప్రయత్నిస్తోందని మండిపడింది. ఇంతకాలం వారికి సాయం చేసినందుకు ఇది శిక్షనా? అని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రశ్నించింది. మిగతా దేశాలపై లాగా తమపై సుంకాలు, బెదిరింపు వ్యూహాలు పనిచేయవని కుంబడద్దలు కొట్టింది.

సుంకానికి ప్రతి సుంకం..

బుధవారం అమెరికా కాంగ్రెస్‌ లో భారత్‌, చైనా సహా పలు దేశాలపై ఏప్రిల్‌ 2 నుంచి ప్రతీకార సుంకాలు అమలు చేస్తామని ట్రంప్ వెల్లడించారు. దీనిపై చైనా ప్రతీకార చర్యలకు దిగింది. అమెరికా నుంచి దిగుమతి అవుతున్న బొగ్గు, ధ్రువీకృత సహజ వాయువుపై (ఎల్‌ఎన్‌జీ) 15 శాతం టారిఫ్ వేసింది. ముడి చమురు, వ్యవసాయ పరికరాలు, పెద్ద ఇంజిన్ల కార్లపై 10 శాతం సుంకం వసూలు చేయనున్నట్లు తెలిపింది.

Tags:    

Similar News