పేరుకే పట్టభద్రులు.. ఓటేయటం రాదా? 10 శాతం చెల్లని ఓట్లు?

పేరుకే పట్టభద్రులా అన్నట్లుగా మారింది తాజాగా తెలంగాణలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక.;

Update: 2025-03-05 03:42 GMT

పేరుకే పట్టభద్రులా అన్నట్లుగా మారింది తాజాగా తెలంగాణలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక. ఈ ఎన్నిక ఫలితాన్ని తేల్చేందుకు ఓట్ల లెక్కింపు వేళ.. ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఈ ఎన్నిక కోసం ఓట్లు వేసినోళ్లంతా పీజీలు.. పీహెచ్ డీలు.. కనీసం డిగ్రీ చదివిన వారే. అలాంటి ఓటర్లకు ఓట్లు వేయటం రాదా? అన్నదిప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. దీనికంటే ఆశ్చర్యకరమైన అంశం ఇంకొకటి ఉంది. టీచర్ల ఎమ్మెల్సీల ఎన్నికల్లో ఓట్టు వేసిన టీచర్ల ఓట్లలో కూడా చెల్లని ఓట్లు పెద్ద ఎత్తున ఉండటంతో ముక్కున వేలేసుకునే పరిస్థితి. పల్లలకు పాఠాలు చెప్పే టీచర్లకు తమ ఓటు తాము వేసుకోకపోవటం దేనికి నిదర్శనం? అన్నదిప్పుడుచర్చగా మారింది.

కరీంనగర్ - మెదక్ - ఆదిలాబాద్ - నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు 3.55 లక్షల ఓట్లు ఉన్నాయి. వీటిల్లో తాజా ఎన్నికల్లో పోల్ అయిన ఓట్లు 2,52,100 మాత్రమే. అంటే.. దాదాపు 1.03 లక్షల ఓట్లు పోల్ కాలేదు. ఇక.. పోల్ అయిన ఓట్లలో 28వేల ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. అంటే.. దగ్గర దగ్గర 11 శాతం ఓట్లు చెల్లకపోవటం దేనికి నిదర్శనం? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. చదువుకున్నోళ్లు ఓట్లు వేసే విషయంలో తప్పులు చేస్తారా? అన్న సందేహంతో మరోసారి వెరిఫై చేశారు.

అప్పుడు కూడా అలాంటి ఫలితమే రావటం గమనార్హం. ఇక.. కరీంనగర్ - మెదక్ - ఆదిలాబాద్ - నిజామాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 897 ఓట్లు.. వరంగల్ - ఖమ్మం - నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ పరిధిలోనూ 499 ఓట్లు చెల్లలేదు. పిల్లల కు పాఠాలు చెప్పే టీచర్లు తాము వేయాల్సిన ఓటును కూడా సరిగా వేయకపోవటం దేనికి నిదర్శనం? అన్నదిప్పుడు చర్చగా మారింది. ఇదిలా ఉంటే.. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల వేదన అంతా ఇంతా కాదు.

ఎందుకంటే.. ఈ ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్న పట్టభద్రులు.. టీచర్లు సైతం ఓటు వేసేందుకు డబ్బులు తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు ఓటుకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పంచినట్లుగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో పట్టభద్రుల అభ్యర్థుల ఎన్నికల్లో ఓటర్లకు రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇంతలా ఖర్చు చేస్తే కొందరు ఓటు వేయటానికే వెళ్లకపోవటం.. వేసినోళ్లలో తప్పుగా వేయటం ఏమిటంటూ కొందరు అభ్యర్థులు లబోదిబోమంటున్న పరిస్థితి. ఓటర్ల తప్పులు తమ పాలిట శాపాలుగా మారుతాయన్న ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News