శోభనం రోజు ప్రియుడికి వీడియో కాల్.. కట్ చేస్తే విషాదం
ఇప్పటి రోజుల్లో ప్రేమ, పెళ్లి, పెద్దల అంగీకారం వంటి అంశాలు తరచూ చర్చనీయాంశమవుతున్నాయి.;
ఇప్పటి రోజుల్లో ప్రేమ, పెళ్లి, పెద్దల అంగీకారం వంటి అంశాలు తరచూ చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా ప్రేమించిన వ్యక్తిని కాకుండా పెద్దల నిర్ణయానికి లోబడి వివాహం చేసుకున్న కొందరు, పెళ్లి తర్వాత కూడా తమ మాజీ ప్రియులతో సంబంధాన్ని కొనసాగించేందుకు ప్రయత్నించడం వల్ల తీవ్రమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఇలాంటి సంఘటనే తమిళనాడులో సంచలనం సృష్టించింది. 27 ఏళ్ల కలైయారసన్ అనే యువకుడికి ఆర్తి అనే యువతిని ఇచ్చి వివాహం చేశారు. అయితే ఆర్తి పెళ్లికి ముందు మరొకరిని ప్రేమించేది. కానీ పెద్దలు ఆ ప్రేమను అంగీకరించకపోవడంతో ఆమె కలైయారసన్‌ను వివాహం చేసుకుంది.
అయితే పెళ్లి అయిన తొలి రాత్రినుంచే ఆమె భర్తను తిరస్కరించడం ప్రారంభించింది. శోభనం రోజునే ప్రియుడికి వీడియో కాల్ చేసి, ఈ వివాహం తనకు ఇష్టంలేదని స్పష్టంగా తెలిపింది. ఈ వ్యవహారం తెలిసిన కలైయారసన్, ఆర్తిని ఆమె పుట్టింటికి పంపించేశాడు.
అయితే కుటుంబ పెద్దలు సముదాయించి, మళ్లీ ఇద్దరిని కలిపే ప్రయత్నం చేశారు. అయితే ఆర్తి మాత్రం తన పద్ధతి మార్చుకోలేదు.
ఒకరోజు కలైయారసన్ తలనొప్పిగా ఉందని టీ అడిగాడు. అయితే ఆమె టీ కాకుండా జ్యూస్ తీసుకువచ్చి ఇచ్చింది. మార్పు వచ్చినట్లు అనుకున్న భర్త ఆనందపడ్డాడు. కానీ కొద్దిసేపటికే విషం ప్రభావంతో అతను రక్తం వాంతులు చేసుకోవడం ప్రారంభించాడు.
ఆ తర్వాత, షాకింగ్ విషయాన్ని ఆర్తి స్వయంగా వెల్లడించింది. ఆ జ్యూస్‌లోనే విషం కలిపినట్టు ఒప్పుకుంది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అతడ్ని పుదుచ్చేరి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కలైయారసన్ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్తిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ప్రియుడి మోజులో ఏకంగా కట్టుకున్న భర్తనే బలిపెట్టిన వధువు వ్యవహారం ఇప్పుడు సంచలనమైంది.