ఐటీ అధికారులకు ఫుల్ పవర్స్.. ఇక వాటిని తనిఖీ చేయవచ్చు
భవిష్యత్తులో ఆదాయపు పన్ను (IT) శాఖ అధికారులకు వ్యక్తిగత డిజిటల్ సమాచారం పరిశీలించే అధికారం లభించనున్నది.;
భవిష్యత్తులో ఆదాయపు పన్ను (IT) శాఖ అధికారులకు వ్యక్తిగత డిజిటల్ సమాచారం పరిశీలించే అధికారం లభించనున్నది. సోషల్ మీడియా ఖాతాలు, ఇ-మెయిల్స్, ఆన్‌లైన్ పెట్టుబడులు, ట్రేడింగ్ అకౌంట్లు తదితర వివరాలను పరిశీలించే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను బిల్లులో పొందుపరిచింది.
- పన్ను ఎగవేతపై కట్టుదిట్టమైన చర్యలు
పన్ను ఎగవేతకు పాల్పడే వ్యక్తులపై మరింత కఠినంగా వ్యవహరించేందుకు ఈ కొత్త నిబంధనలు అమలు కానున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు, నగదు, బంగారం కలిగి ఉన్నట్లు అనుమానం వస్తే, సంబంధిత ఖాతాలను ఐటీ అధికారులు పరిశీలించేందుకు వీలు కల్పించనున్నారు.
-లాకర్లు, డోర్లు పగలగొట్టే అధికారం – మరింత విస్తరణ
ప్రస్తుతం అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం.. ఐటీ అధికారులకు నిర్దిష్ట స్థాయిలో మాత్రమే పరిశీలన, తనిఖీల హక్కు ఉంది. విశ్వసనీయ సమాచారం ఆధారంగా పన్ను ఎగవేత జరుగుతోందని అనిపిస్తే, లాకర్లు, డోర్లు పగలగొట్టి కీలక ఆర్థిక పత్రాలను స్వాధీనం చేసుకునే అధికారం ఉన్నది. కానీ, కొత్త ఆదాయపు పన్ను బిల్లు ద్వారా ఈ అధికారాలను మరింత విస్తరించారు. ఇకపై వర్చువల్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, కంప్యూటర్ సిస్టమ్‌ల్లోకి ప్రవేశించి వివరాలను పరిశీలించే అధికారం కూడా లభించనుంది.
- డిజిటల్ సమాచారంపై నిఘా
డిజిటల్ యుగానికి అనుగుణంగా రూపొందించిన ఈ మార్పులతో, పన్ను ఎగవేతకు సంబంధించి ఆధారాలు ఉంటే ఇ-మెయిల్స్, బ్యాంక్ ఖాతాలు, ట్రేడింగ్ ఖాతాలు, సోషల్ మీడియా కార్యకలాపాలు తదితర అంశాలను పరిశీలించేందుకు ఐటీ అధికారులకు పూర్తి హక్కు లభించనుంది.
- ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి..
ఈ కొత్త ఆదాయపు పన్ను బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందితే, 2026 ఏప్రిల్ 1 నుంచి ఇది అమలులోకి రానుంది. అయితే, ఈ మార్పులు నిజంగా పన్ను ఎగవేతను నిరోధించగలవా? లేక వ్యక్తిగత గోప్యతపై కొత్త ప్రశ్నలను లేవనెత్తతాయా? అనే అంశంపై భవిష్యత్‌లో స్పష్టత రానుంది.