బొత్సను పెంచేస్తున్నారు... సాఫ్ట్ కార్నర్ ఎందుకు ?
వైసీపీలో సీనియర్ మోస్ట్ లీడర్ గా బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఒక విధంగా ఆయన సీఎం మెటీరియల్.;
వైసీపీలో సీనియర్ మోస్ట్ లీడర్ గా బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఒక విధంగా ఆయన సీఎం మెటీరియల్. ఉమ్మడి ఏపీకి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తరువాత సీఎం అవాల్సిన వారు. ఆయన పేరు కూడా చివరిదాకా పరిశీలనలోకి వచ్చి బ్యాడ్ లక్ తో ఆగింది. ఇక ఆయన 23 ఉమ్మడి జిల్లాల ఉమ్మడి ఏపీకి పీసీసీ చీఫ్ గా చేసిన నాయకుడుగా ఉన్నారు. అటువంటి బొత్స వైసీపీలో చేరడం అంటే అది వింతగానే చెప్పుకున్నారు.
అయితే బొత్స తన రాజకీయం కోసం వైసీపీని ఆశ్రయించక తప్పింది కాదని కూడా అంటారు. ఇక బొత్సకు బలమైన సామాజిక వర్గం దన్నుగా ఉంది. అంతే కాకుండా ఆయన రాజకీయ వ్యూహాలు కూడా వేరే లెవెల్ లో ఉంటాయి. అంగబలం అర్ధబలం దండిగా ఉన్న బొత్సకు వైసీపీలో జగన్ అందుకే ఎక్కువగా విలువ ఇస్తారు. ఆయనను అయిదేళ్ళ పాటు మంత్రిగా కొనసాగించారు అంటే బొత్సకి ఇస్తున్న ప్రయారిటీగానే చూడాలి.
ఇక ఇలా బొత్స ఓడగానే అలా శాసనమండలి మెంబర్ అయ్యారు. ఆ వెంటనే లీడర్ ఆఫ్ అపొజిషన్ గా కేబినెట్ ర్యాంక్ పదవిని సంపాదించారు. ఇక వైసీపీ అసెంబ్లీకి రాని నేపథ్యంలో శాసనమండిలే పెద్ద దిక్కుగా ఉంది. అక్కడ బొత్స తన అనుభవం అంతా ఉపయోగించి అధికారం పక్షాన్ని నిలదీస్తున్నారు.
చిత్రమేంటి అంటే వైసీపీ నుంచి ఏ గొంతు పెద్దగా లేచినా అధికార పక్ష సభ్యులు గట్టిగా రివర్స్ ఎటాక్ చేస్తారు. అలాంటిది బొత్స ధాటీగా మాట్లాడుతున్నా పెద్దగా అధికార పక్షం నుంచి చెక్ పెట్టేది లేకుండా పోతోంది అంటున్నారు. అంతే కాదు బొత్స మీద పరుష పదజాలం కూడా ఉపయోగించడం లేదు. ఆయనకు కావాల్సినంత సేపు సభలో మాట్లాడే వీలు కల్పిస్తున్నారు. దాంతో బొత్స మండలిలో హైలెట్ అవుతున్నారు.
ఇలా ఎందుకు అన్నదే ఇపుడు రాజకీయంగా చర్చ సాగుతోంది. వైసీపీలో ఇప్పటిదాక జగన్ తప్ప మరో పేరు వినిపించేది కాదు, కానీ వైసీపీ అసెంబ్లీకి వెళ్ళక పోవడం వల్ల మండలిలో బొత్స చాలా కీలకంగా మారిపోయారు ఆయన వాయిస్ మాత్రమే ఇపుడు వినిపిస్తోంది. దాంతో అమాంతం బొత్స ఇమేజ్ కూడా పెరిగిపోతోంది. ఏపీలో ప్రతిపక్ష నాయకుడు అంటే బొత్స అన్నంతగా పరిస్థితి ఉంది.
ఇక రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న బొత్స కూడా తనకు దక్కిన ఈ అవకాశాన్ని ఏ మాత్రం వదులుకోవడంలేదు. ఆయన కూడా కూటమి ప్రభుత్వం మీద దూకుడు చేస్తూ పదునైన విమర్శలు చేస్తున్నారు. అయితే బొత్స ఈ విధంగా చేస్తున్నా అధికార పక్షం ఆయనను అలా ప్రోత్సహిస్తున్నారా అన్నదే కొత్త చర్చగా ఉంది.
వైసీపీలో బడా లీడర్లను టార్గెట్ చేస్తున్న కూటమి పెద్దలు బొత్స విషయంలో సాఫ్ట్ కార్నర్ తో ఉన్నారని ప్రచారమూ ఉంది. బొత్స సైతం పార్లమెంటరీ లాంగ్వేజ్ ని ఎక్కడా మిస్ అవకుండా మాట్లాడుతూ అధికార పక్ష సభ్యుల మీద వ్యక్తిగత విమర్శలు చేయడం లేదు. పాలసీనే ఆయన మాట్లాడుతున్నారు.
ఇక వైసీపీలో నంబర్ టూ గా బొత్స అన్నది కూడా ఇపుడు ప్రచారంలో ఉంది. ఆ విధంగా బొత్సను పెంచడం ద్వారా వైసీపీలో ఆయన స్థాయిని రెట్టింపు చేయడం ద్వారా ఆ పార్టీలో ఏదైనా జరగకపోతుందా అన్నది కూటమి పెద్దల వ్యూహంగా ఉందా అన్నది కూడా చర్చగా ఉంది. ఇక బొత్స విషయం తీసుకుంటే ఆయనకు 2028 చివరి వరకూ ఎమ్మెల్సీ పదవి ఉంది. దాంతో పాటు కేబినెట్ ర్యాంక్ తో కూడిన లీడర్ ఆఫ్ అపొజిషన్ పదవి ఉంది.
దాంతో ఆయన వైసీపీలోనే ఉంటూ పోరాటం చేయవచ్చు. ఈలోగా ఆయన రాజకీయ ఇమేజ్ ని పెంచుకోవచ్చు. ఈ విధంగా బొత్స దూకుడునే తన రూట్ గా మార్చుకుంటే వైసీపీలో జగన్ కాదు బొత్స లీడర్ ఆఫ్ అపొజిషన్ అని ఆయనే ప్రజా పక్షం అని చూపించడానికి అన్నట్లుగా చాన్స్ ఇస్తూ పోతోంది అని అంటున్నారు. చూడాలి మరి జగన్ గైర్ హాజరు వేళ మండలిలో వైసీపీ పెరిగింది. బొత్స ఇమేజ్ కూడా పెరిగింది. ఇదే తీరు రానున్న కాలమంతా కొనసాగితే బొత్స రాజకీయ దూకుడుని కూడా ఆపేవారు ఎవరూ లేరనే అంటున్నారు.