అసెంబ్లీలో ఇదేం పని.. ఎమ్మెల్యేలందరినీ పిలిచి కడిగేసిన స్పీకర్
సభా హాల్‌లో ఓ ఎమ్మెల్యే పాన్ మసాలా నమిలి అక్కడ ఉమ్మివేయడం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటన సభ స్పీకర్ సతీష్ మహానా దృష్టికి వెళ్లింది.;
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. సభా హాల్‌లో ఓ ఎమ్మెల్యే పాన్ మసాలా నమిలి అక్కడ ఉమ్మివేయడం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటన సభ స్పీకర్ సతీష్ మహానా దృష్టికి వెళ్లింది.
సభ ప్రారంభానికి ముందు స్పీకర్ సతీష్ మహానా అసెంబ్లీ హాల్‌ను పరిశీలించగా, అక్కడ ఎవరో ఉమ్మివేశారని గమనించారు. దీనిపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, అసెంబ్లీ హాల్‌ను శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అందరిదేనని పేర్కొన్నారు. "ఇక్కడ ఒకరు ఉమ్మేశారు. నేను స్వయంగా వెళ్లి శుభ్రం చేశాను. అసెంబ్లీ హాల్‌కు ఇది అసభ్యకరమైన చర్య. ఆ ఎమ్మెల్యే ఎవరో నాకు వీడియో ద్వారా తెలుసు. అయితే, వారి పేరు బయట పెట్టడం నా ఉద్దేశ్యం కాదు. వారు స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలి, లేకుంటే నేనే పిలవాల్సి వస్తుంది," అని స్పీకర్ అన్నారు.
సభ హాల్‌లో స్పీకర్ స్వయంగా శుభ్రం చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. "ఇది ప్రజాస్వామ్యం కోసం నిబద్ధతతో ఉన్న సభ్యుల ప్రవర్తనా?", "అసెంబ్లీలో కూడా ఇలాంటి పనులు చేయడమేంటీ?" అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇకపై అసెంబ్లీలో మరెవ్వరూ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకూడదని స్పీకర్ విజ్ఞప్తి చేశారు.
ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో కూడా చర్చ నడుస్తోంది. సభ్యులు తమ ప్రవర్తనలో బాధ్యత కలిగి ఉండాలని, అసెంబ్లీ గౌరవాన్ని కాపాడాలని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.