దొరబాబు జనసేనలో చేరిక.. వర్మకు కాక.. పవన్ వ్యూహం ఇదేనా?

గత ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సేఫ్ గా గెలిచే సీటు ఏది? అనే పెద్ద చర్చ జరిగింది.;

Update: 2025-03-04 13:35 GMT

రాజకీయాలు అంటే ఇంతే..? పైకి కనిపించని ఎత్తులు.. లోలోపల పొత్తులు.. అప్పటివరకు సాయం పొందినవారే తర్వాత చేయిస్తారు.. అందరూ ఇలానే ఉంటారని చెప్పలేం.. ఎక్కువమంది మాత్రం అలానే ఉంటారు.

గత ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సేఫ్ గా గెలిచే సీటు ఏది? అనే పెద్ద చర్చ జరిగింది. వాస్తవానికి అప్పటి పరిస్థితుల ప్రకారం పవన్ ఎక్కడినుంచైనా గెలిచే చాన్సుండేది. కానీ, 2019 ఎన్నికల్లో రెండు సీట్లలోనూ ఓడిపోయిన ప్రభావంతో అధినేత కోసం జనసేన శ్రేణలు సేఫ్ సీట్ ను ఎంపిక చేశాయి.

ఉమ్మడి తూర్పుగోదావరి.. ప్రస్తుత కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం అధికం. దీంతోపాటు జనసేన కూడా చాలా బలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ పిఠాపురంలో బరిలో దిగాలని నిర్ణయించారు.

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ వర్మ.. టీడీపీకి బలమైన అభ్యర్థి. కానీ, పవన్ కల్యాణ్ కోసం ఆయన టికెట్ ఇవ్వలేదు. వర్మకు న్యాయం చేస్తామని చెప్పినా దాదాపు ఏడాదిగా అదేమీ జరగలేదు.

ఈ మధ్యకాలంలో పిఠాపురంలో జనసేన-టీడీపీ అభిమానులు అనేకంటే పవన్-వర్మ మద్దతుదారుల మధ్య విభేదాలు పొడసూపాయి. వర్మ నేరుగా స్పందించకున్నా.. ఆయనకూ పరిస్థితులు తెలిశాయి. ప్రజల్లో మంచి అభిమానం ఉన్న వర్మ బయటపడడం లేదు.

తాజాగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేనలో చేరిక ఖాయమైంది. ఆగస్టులోనే వైసీపీకి రాజీనామా చేసిన దొరబాబు.. కుటుంబ సమేతంగా పవన్ ను కలిశారు. దీంతో రేపోమాపో ఆయన జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లు స్పష్టమవుతోంది.

పిఠాపురంలో బలమైన నాయకుడైన దొరబాబును జనసేనలో చేర్చుకోవడం ఓ విధంగా వర్మకు చెక్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News