బాబు మెచ్చిన మంత్రి ....నిండు సభలో కితాబు

2024లో గెలిచి ఏకంగా కీలకమైన జలవనరుల శాఖకు మంత్రి అయ్యారు.;

Update: 2025-03-04 13:42 GMT

ఆయన అంటే చంద్రబాబుకు ప్రత్యేక అభిమానం. ఆయన పార్టీకి నిబద్ధత కలిగిన నాయకుడు. పార్టీ ఆదేశాలు తుచ తప్పకుండా పాటిస్తారు. మంచి సబ్జెక్ట్ ఉన్న వారు. ఉన్నత విద్యావంతుడు. ఆయనే పాలకొల్లుకు చెందిన నిమ్మల రామానాయుడు. ఆయన 2014లో తొలిసారి గెలిచారు. 2019లో రెండోసారి జగన్ వేవ్ లో గెలిచి విపక్షంలో తన సత్తా చాటారు. 2024లో గెలిచి ఏకంగా కీలకమైన జలవనరుల శాఖకు మంత్రి అయ్యారు.

నిమ్మల రామానాయుడు జలవనరుల శాఖలో తనదైన శైలిలో పనిచేస్తూ రాణింపు తెచ్చారు. గత ఏడాది విజయవాడకు భారీ వరదలు వస్తే బుడమేరు కాలువకు మూడు రోజులు వానలలో సైతం ఎక్కడా తగ్గకుండా రాత్రీ పగలూ పనిచేసి గండి పూడ్చిన అంకితభావంతో అందరి మన్ననలు అందుకున్నారు.

ఇక పోలవరం ప్రాజెక్టు విషయంలో పూర్తి ఏకాగ్రతతో పనిచేస్తూ వస్తున్న రామానాయుడు బాబు మెచ్చిన మంత్రిగా ముందు వరసలో ఉన్నారు. అందుకే చంద్రబాబు తన సహజ సిద్ధమైన వైఖరికి భిన్నంగా నిండు సభలో రామానాయుడుని పొగిడారు. మామూలుగా అయితే ఎంత కష్టపడి పనిచేసినా బాబు నుంచి మెచ్చుకోలు అందుకోవాలంటే బహు కష్టం. బాబు పెట్టిన బెంచ్ మార్క్ ని చేరువ కావడం చాలా మందికి సవాల్ గా ఉంటుంది. తానుగా బాగా కష్టపడే బాబుకు మిగిలిన వారి కష్టాన్ని గుర్తించడంలో ఎంతో ఉదారత ఉంటుంది కానీ ఆయన పైకి వారికి ఎక్కువగా ప్రశంసించరు.

కానీ నిమ్మల విషయంలో మాత్రం బాబు మాట్లాడుతూ పనిమంతుడు మా నిమ్మల అన్నారు. ఏపీలోని మొత్తం 80కి పైగా రిజర్వాయర్లలో నీరు నూరు శాతం నింపించిన ఘనత రామానాయుడుదే అన్నారు. తుంగభద్ర నది కొంత ఏపీకి కూడా ఉందని అయితే ఆ నదిలో గేట్ ఒకటి కొట్టుకుని పోవడంతో కర్ణాటక ప్రభుత్వమే ఎందుకొచ్చిన తంటా మన వల్ల కాదని వదిలేసిందని బాబు చెప్పారు. కానీ నిమ్మల రామానాయుడు మాత్రం కన్నమనాయుడు అనే నిపుణుడిని వెంటబెట్టుకుని వెళ్ళి మరీ గేట్ గట్టిగా బిగించేలా చూశారని దాంతో తుంగబధ్ర నీరు నిలిచిందని చెప్పారు. ఇపుడు కర్ణాటక ప్రభుత్వం కన్నమనాయుడుని సత్కరిస్తోందని ఆయన చెప్పారు

ఏపీలో జలవనరుల శాఖ పనులను పరుగులు పెట్టించడంతో నిమ్మల మార్క్ చూపించారని కితాబు ఇచ్చారు. దీంతో సభలో మంత్రులు మిగిలిన కూటమి సభ్యులు అంతా నిమ్మలను అ బల్లపైన చప్పట్లతో అభినందించారు. నిమ్మల బాబు తనను పొగుడుతున్నప్పుడు ఆయనకు దండం పెడుతూ వినయంగా అలా చిరు నవ్వుతో కూర్చుండిపోయారు మొత్తం మీద బాబు మంత్రులలో టాప్ ర్యాంక్ అయితే నిమ్మల దక్కించుకున్నారు అన్నది అసెంబ్లీ సాక్షిగా అర్ధమైంది అంటున్నారు.

Tags:    

Similar News