జనాలు తెలుసుకోరు.. మీరే చెప్పాలి.. జగనూ...!
అన్నీ జనాలు తెలుసుకుంటారులే.. మనం చెప్పకపోయినా ఫర్వాలేదులే.. అనుకునే రోజులు పోయాయి.;
అన్నీ జనాలు తెలుసుకుంటారులే.. మనం చెప్పకపోయినా ఫర్వాలేదులే.. అనుకునే రోజులు పోయాయి. బలమైన మీడియా ప్రభావం ప్రజలపై బాగానే పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ చేసిన మంచి పనులు ఆ పార్టీనే చెప్పుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా ఏపీకి 400 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇవి ఉచితార్థంగా వచ్చిన ఎమౌంటే. కేంద్రం రెండు రోజుల కిందట రూ.400 కోట్లను ఏపీఖాతాలో వేసింది. దీనిపై కూటమి పార్టీలు కిక్కురుమనలేదు.
నిధులు వచ్చాయన్న విషయాన్ని కూడా.. ప్రధాన మీడియా చాలా తక్కువగా చేసి చూపింది. దీనికి కార ణం.. వైసీపీ హయాంలో చేపట్టిన సంస్కరణల కారణంగానే రూ.400 కోట్లను కేంద్రం ఇచ్చింది. కేంద్రంలో మోడీ సర్కారు వచ్చిన తర్వాత..తాము చెప్పినట్టు విని.. సంస్కరణలకు మొగ్గు చూపే రాష్ట్రాలకు ఉదారంగా నిధులు ఇస్తోంది. ఈ క్రమంలోనే భూముల రీసర్వే పేరుతో సంస్కరణను తీసుకువచ్చింది. తెలంగాణలో దీనిని ధరణి పేరుతో అమలు చేశారు.
ఏపీలో జగనన్న భూరక్ష-భూసర్వే పేరుతో అమలు చేశారు. ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్నారు. అయితే.. ఇది వివాదంగా మారి.. ఎన్నికలకు ముందు.. జగన్‌పై కూటమి పార్టీలు తీవ్ర విమర్శలు చేశారు. భూముల రీసర్వే చేసిన తర్వాత.. చాలా మందికి పట్టాలు ఇచ్చారు. ఈ పట్టాలపై జగన్ ఫొటోలు వేసుకోవ డం అప్పట్లో వివాదానికి దారి తీసింది. ఇక, దీనిని ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. కట్ చేస్తూ.. కూటమి సర్కారు వచ్చింది. అయితే.. సర్వే మాత్రం మారుతోంది. కేవలం పేరు మాత్రమే మార్చారు.
`జగనన్న భూరక్ష` పేరు తీసేసి.. `రీసర్వే` పేరుతో కొనసాగుతోంది. దీనిని కొనసాగిస్తున్న క్రమంలోనే రూ.400 కోట్లను కేంద్ర ప్రభుత్వం గ్రాంటుగా విడుదల చేసింది. ఈ విషయం తెలిసి కూడా.. కూటమి ప్రభుత్వం చెప్పదు. ఎవరికి ఉండే రాజకీయ కారణాలు వారికి ఉంటాయి. అయితే.. ఈ విషయాన్ని ప్రధానంగా ప్రొజెక్టు చేసుకోవాల్సింది.. వైసీపీనే. కానీ, దీనిని వదిలేసిన వైసీపీ .. అసలు దీనిపై కిక్కురుమనడంలో లేదు. అంటే.. అంతా ప్రజలే తెలుసుకుంటారని అనుకుంటోందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కానీ, ఆ అవకాశం లేదన్న విషయాన్ని వైసీపీనే గ్రహించాలి.