నాగబాబుకు రాజ్యసభా? కార్పొరేషన్ ఛైర్మన్ గిరి?
ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు దక్కే పదవిపై జరుగుతున్న ప్రచారం ఇప్పుడు ఆసక్తికర మలుపు తీసుకుంది;
ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు దక్కే పదవిపై జరుగుతున్న ప్రచారం ఇప్పుడు ఆసక్తికర మలుపు తీసుకుంది. ఆయనకు దక్కే పోస్టు ఏమిటన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఆయన్ను మంత్రి చేస్తానని ఒకసారి.. కాదు రాజ్యసభ సభ్యుడ్ని చేస్తారని మరోసారి.. కాదు కాదు.. నాగబాబు అభిరుచులకు తగ్గట్లు.. ఒక కార్పొరేషన్ ఛైర్మన్ గిరి కట్టబెడతారన్న ప్రచారం సాగుతోంది. మొత్తంగా నాగబాబుకు దక్కే ఏది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
ఎందుకీ కన్ఫ్యూజన్? అన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. తన సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి.. మంత్రి పదవి కట్టబెట్టాలన్న ఆలోచన పవన్ చేసినట్లు చెబుతున్నారు. పవన్ కల్యాణ్ నోరు తెరిచి అడగాలే కానీ.. మరో మాటకు అవకాశం లేకుండా అందుకు ఓకే అనేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. అయితే.. సమస్య ఎక్కడో లేదని పవన్ దగ్గరే ఉందని చెబుతున్నారు.
తన సోదరుడు నాగబాబుకు మంత్రి పదవిని కట్టబెట్టే విషయంలో పవన్ ఒక అడుగు ముందుకు వేస్తే.. మరో రెండు అడుగులు వెనక్కి వేయటంతోనే అనవసర కన్ఫ్యూజన్ కు కారణమవుతుందన్న మాట వినిపిస్తోంది. తమ ఇద్దరు అన్నదమ్ములు మంత్రివర్గంలో ఉంటే.. విమర్శలకు అవకాశం ఇవ్వటంతో పాటు.. తాను చెప్పే ఆదర్శాలు.. సిద్ధాంతాలకు భిన్నంగా ఉంటాయన్న సందేహమే మొత్తం కన్ఫ్యూజన్ కు కారణమని చెబుతున్నారు. ఈ క్రమంలోనే నాగబాబుకు రాజ్యసభ పదవిని కట్టబెట్టి ఢిల్లీకి పంపిస్తే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది.
అయితే.. పదవుల మీద పెద్ద ఆసక్తి లేని నాగబాబు.. ఎంపీ పదవి అలంకార ప్రాయంగా కాకుండా ఏపీకి ఏమైనా చేసేలా ఉంటే బాగుంటుందన్న మాట ఆయన నోటి నుంచి వచ్చినట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో.. రాజ్యసభ పదవి దక్కినా.. తాను చేయగలిగిన పనులు ఏమీ ఉండవన్న భావన ఆయనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు.. ఈ పోస్టు బీజేపీకి అవసరమైన నేపథ్యంలో. .వారిని అడిగి తీసుకొని.. అందుకు బదులుగా మరో పదవిని బీజేపీకి కేటాయించటం లాంటి అంశాలపైనా పవన్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.
ఈ మొత్తానికి ముగింపు పలికేలా సరికొత్త ఆలోచనలో పవన్ ఉన్నట్లుగా చెబుతున్నారు. నాగబాబు అభిరుచులకు అనుగుణంగా.. పర్యావరణం.. విద్య.. పేదరిక నిర్మూలన.. లాంటి అంశాలకు సంబంధించి ఒక కార్పొరేషన్ కు ఛైర్మన్ గా నియమించి.. తగిన నిధులు ఇస్తే.. బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో ఎమ్మెల్సీ పదవి.. ఎంపీ పదవికి వేరే వారికి కేటాయించటం ద్వారా.. ఒకరికి అదనంగా పదవి లభించే వీలుందన్న మాట వినిపిస్తోంది. నాగబాబు అభిరుచులకు తగ్గట్లు ఉండాలంటే రాజ్యసభ సభ్యత్వం కానీ ఎమ్మెల్సీ పదవి కానీ సరిపోదని.. కార్పొరేషన్ ఛైర్మన్ సరిగ్గా కుదురుతుందని అంటున్నారు. దీంతో.. కొంత గందరగోళం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. నాగబాబుకు ఏ పదవి కేటాయిస్తారన్నది అధికారపక్షంలోనే గందరగోళం నెలకొన్నట్లుగా చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.