తమిళనాడులోనూ మోడీషాల ఆపరేషన్? పళణిస్వామి సంచలన వ్యాఖ్యలు

Update: 2022-09-08 08:18 GMT
రాష్ట్రం ఏదైనా కావొచ్చు.. తాము అధికారంలో ఉంటే సరి. లేదంటే మాత్రం.. ఆ రాష్ట్రంలోని అధికార పార్టీకి ఉక్కబోత పోసేలా వ్యవహరించే బీజేపీ అధినాయకత్వం.. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అదే విధానాన్ని ఫాలో అయి.. అక్కడి ప్రభుత్వాల్ని దెబ్బ తీయటం తెలిసిందే. తమ ఫార్ములాను తాజాగా తమిళనాడులోనూ అమలు చేసే దిశగా మోడీషాలు పావులు  కదుపుతున్నారా? అంటే అవునన్న సందేహం కలిగే పరిణామం తాజాగా చోటు చేసుకుంది.

తమిళనాడులో తిరుగులేని అధికారాన్ని సొంతం చేసుకున్న డీఎంకే.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్టాలిన్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ రాష్ట్రంలో అత్యంత పాపులర్ నేత ఆయన మాత్రమే అన్న విషయం తెలిసిందే. అసెంబ్లీలోనూ ఆయనకు..

ఆయన పార్టీకి తిరుగులేని అధిక్యత ఉందన్న సంగతి తెలిసిందే. ఇలాంటి తమిళనాడులోనూ మోడీషాల ఆపరేషన్ షురూ అయ్యిందనా? అన్న అనుమానం కలిగే పరిణామం చోటు చేసుకుంది. తాజాగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి మాట్లాడుతూ.. తమతో 10 మంది డీఎంకే ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నట్లుగా పేర్కొన్నారు.

అన్నాడీఎంకేతో పది మంది డీఎంకే ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ పళని స్వామి చేసిన ప్రకటన సంచలనంగా మారింది. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూడి మాజీ ఎమ్మెల్యే విజయకుమార్ కుమార్తె పెళ్లికి హాజరైన పళని స్వామి.. తనను కలిసిన మీడియా సభ్యులతో ఈ సంచలన వ్యాఖ్య చేశారు. అదే సమయంలో తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు డీఎంకేకు టచ్ లో ఉన్న మాటలో వాస్తవం లేదన్నారు. తమకు టచ్ లో ఉన్న ఎమ్మెల్యేల్ని పార్టీలోకి రావాలని  కోరుకుంటున్నట్లు చెప్పారు.

అన్నాడీఎంకేలోకి శశికళ.. దినకరన్ లకు చోటు లేదని స్పష్టం చేశారు. తిరుగులేని అధిక్యతతో ఉన్న స్టాలిన్ సర్కారును వదిలేసి.. పది మంది అధికార పార్టీ వారు ప్రతిపక్ష పార్టీలోకి చేరే ధైర్యం ఎలా చేస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. పళని నోటి నుంచి వచ్చిన మాటల వెనుక మోడీషాలు ఉండే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News