ఎంపీలు అప్పు తీసుకునేలా చేశారట!

Update: 2016-11-17 03:42 GMT
పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని తీసుకున్న నిర్ణయం సామాన్యుడికి ఎంతలా సినిమా చూపిస్తుందన్నది నిత్యం టీవీల్లోనూ.. పేపర్లలోనూ చూస్తున్నదే. మరి.. ఇదే విషయంలో ఎంపీలు ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు? దేశ వ్యాప్తంగా ఉన్న ఎంపీలు దీనిపై ఎలా స్పందిస్తున్నారన్న విషయంపై స్పష్టత లేదనే చెప్పాలి. తాజాగా ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలతో ఆ కొరత తీరిపోయినట్లేనని చెప్పాలి.

పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో బుధవారం ప్రారంభమైన పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఏ ఇద్దరు ఎంపీలు కలిసినా.. పెద్దనోట్ల రద్దు నిర్ణయం మీదనే మాట్లాడుకోవటం కనిపించింది. ఈ సందర్భంగా కొందరు జోకులు వేసుకోగా.. మరికొందరు మాటల తూటాల్ని విసిరారు. ప్రైవేటు సంభాషణల్లో తమను మోడీ దెబ్బేసినట్లుగా పలువురు ఎంపీలు అభిప్రాయపడినట్లుగా చెబుతున్నారు.

ఇక.. లక్షల జీతం వచ్చినా.. చిల్లర మొత్తాల కోసం అప్పు తీసుకునేలా ప్రధాని చేశారన్న మాట పలువురు ఎంపీల నోట వినిపించింది. అంతే కాదు.. ఒక వెయ్యి అప్పు ఉంటే ఇవ్వు అంటూ పలువురు ఎంపీలు సహచర ఎంపీలతో నవ్వుతూ అడగటం కనిపించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మరికొందరు ఎంపీలు.. బ్యాంకుల్లో ఎంత మొత్తాన్ని వేసుకుంటే ఇబ్బంది ఉండదన్న అంశంపై సీరియస్ గా చర్చించుకోవటం కనిపించింది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ తరహా చర్చల దగ్గర తెలుగు ప్రాంతానికి చెందిన ఎంపీలు కాస్త చురుగ్గా ఉన్నట్లుగా చెబుతున్నారు. కొందరి మాటల్ని చూస్తే.. ప్రధాని తాజా నేపథ్యంలో ఎంపీల అకౌంట్లో ఎంత మొత్తం వరకు జమ చేసుకోవచ్చన్న అంశంపై తెలుగు ఎంపీలు సలహాలు సూచనలు ఇవ్వటం కనిపించింది. రూ.5కోట్ల వరకూ డిపాజిట్ చేసినా ఇబ్బంది లేదని.. అంతకుమించి మాత్రం డిపాజిట్ చేస్తే తిప్పలు తప్పవన్న మాట పలువురు ఎంపీలకు సలహాలు ఇవ్వటం  వినిపించింది. ఇక.. వ్యాపారాలున్న ఎంపీలు ఇప్పటివరకూ 20 శాతం బ్లాక్ లో తీసుకునే వారని.. ఇకపై అలాంటి వాటికి చెక్ పెట్టేసి.. మొత్తం వైట్ లో తీసుకోవటం ఉత్తమం అన్న మాట వినిపించటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News