కాపుల కల కల్లే : ముద్రగడ - పవన్ రెడీనా?

Update: 2018-02-15 04:21 GMT
కాపులకు చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ బీసీల్లో చేర్చడం - రిజర్వేషన్ అనేది ప్రస్తుతానికి అటకెక్కినట్టే. ఈ విషయంలో చంద్రబాబునాయుడు దారుణమైన వంచనకు పాల్పడ్డారని ఇప్పుడు కాపుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు బాబుకు బుద్ధి చెప్పాల్సిందేనని.. కాపులకు అసలైన న్యాయం జరిగే వరకు పోరాటం సాగించాల్సిందేనని కాపులు తలపోస్తున్నట్లుగా తెలుస్తోంది. కేంద్రంలో ఆమోదం పొందడానికి అవకాశం లేకుండా - అపరిపక్వమైన బిల్లును రూపొందించి పంపినందుకు చంద్రబాబునాయుడుకు - కాపుల ఆగ్రహం తెలిసివచ్చేలా చేయాలని పలువురు అంటున్నారు. కాపుల తరఫున తిరిగి ఉద్యమం చేయడానికి ముద్రగడ పద్మనాభం గానీ, కాపులకోసం కోరడం కాకపోయినా.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చి తీరాల్సిందే అంటున్న పవన్ కల్యాణ్ గానీ.. ప్రస్తుతం కాపు వర్గానికి మద్దతుగా రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నారా? అనే చర్చలు కూడా నడుస్తున్నాయి.

చంద్రబాబు సర్కార్ సుదీర్ఘ కాలం నాన్చిన తర్వాత.. హడావుడిగా కాపు రిజర్వేషన్ బిల్లును రూపొందించి.. దాన్ని కేంద్రం ఆమోదానికి పంపిన సంగతి తెలిసిందే. సిస్టమ్ ప్రకారం.. కేంద్ర హోం శాఖ ఆ బిల్లును అన్ని శాఖల అభిప్రాయాలు కోరుతూ సర్కులేట్ చేసింది. అయితే.. ఇలాంటి విషయాల్లో ఎంతో కీలకమైన సిబ్బంది వ్యవహారాల శాఖ మాత్రం బిల్లులో లోపాలను స్పష్టంగా ఎత్తి చూపించి.. దీనిని ఆమోదించడానికి లేదంటూ నోట్ పెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. కేంద్రం ఆమోదిస్తే తప్ప కాపు రిజర్వేషన్ అమల్లోకి రాదు. ఈ నోట్ నేపథ్యంలో మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి దాటడానికి వీల్లేదని - అలా దాటాలంటే చూపాల్సిన బలమైన కారణాలను కూడా పేర్కొనలేదని సిబ్బంది శాఖ హోంకు తెలిపినట్లుగా సమాచారం. అంటే.. చంద్రబాబు సర్కారు ఏదో మొక్కుబడిగా బిల్లును కేంద్రానికి పంపిందే తప్ప... అది ఆమోదం పొందాలనే చిత్తశుద్ధితో పంపలేదని తేలుతున్నదని పలువురు అంటున్నారు.

అసలే కాపుల రిజర్వేషన్ అమల్లోకి రావడానికి మార్చి 31 డెడ్ లైన్ అంటూ.. మరో పోరాటానికి ముద్రగడ పిలుపు ఇచ్చి ఉన్నారు. ప్రస్తుత సంకేతం చూస్తోంటే మరికొన్ని నెలలు గడిచినా ఈ బిల్లు చట్టమై వారికి రిజర్వేషన్ రావడం అసాధ్యమే అని అనుకుంటున్నారు. మరి ఎవరో పోరాడుతారో.. ఎవరు చంద్రబాబును ప్రశ్నిస్తారో? కాపులకు వారికిచ్చిన హామీ ప్రకారం జరగడానికి ఎవరు పూనుకుంటారో వేచిచూడాలి.
Tags:    

Similar News