అమెరికన్లకు కొత్త రోగం.. ‘ఏషియన్ అమెరిక్లపై వివక్ష’

Update: 2021-03-14 05:05 GMT
వివాదాలకు దూరంగా.. తన పని తాను అన్నట్లుగా చేసుకుపోయే టెక్ దిగ్గజ ప్రముఖుడు కమ్ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తాజాగా సంచలన వ్యాఖ్య చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నోటి నుంచి ఏషియన్ అమెరికన్లపై వివక్ష పెరుగుతున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేసిన పక్క రోజునే ఆయనీ వ్యాఖ్య చేయటం గమనార్హం. అమెరికా సమాజంలో ఏషియన్ అమెరికన్లపై ద్వేష భావం దారుణమన్నారు. ఇదే అంశంపై తాజాగా అమెరికా చట్టసభల ప్రతినిధులు పలువురు ఆందోళన వ్యక్తం చేసిన వేళలోనే సత్యానాదెళ్ల పెదవి విప్పారు.

గత ఏడాది మార్చి నుంచి డిసెంబరు మధ్య కాలంలో ఏషియన్ అమెరికన్లను ద్వేషించినట్లుగా మూడు వేల కేసులు నమోదైనట్లుగా తాజాగా బాధితుల తరఫున న్యాయవాద టీం తన నివేదికను బయటపెట్టింది. ఎఫ్ బీఐ గణాంకాల ప్రకారం 2019లో ఇలాంటివి 216 కేసులు మాత్రమే నమోదు అయితే.. ఏడాది వ్యవధిలో కేసుల తీరు భారీగా పెరిగిపోయాయి.  ఓ వైపు నివేదిక.. మరోవైపు వివక్ష పై జో బైడెన్ సర్కారు ఆందోళన వ్యక్తం చేసిన వేళలో.. సత్యా నాదెళ్ల ఈ అంశంపై స్పందించారు.

సోషల్ మీడియాలోని తన ఖాతాలో పోస్ట్ పెట్టారు. ‘ఏషియన్లపై అమెరికాలో.. ఇతర ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న ద్వేషభావం చూసి నేను ఆందోళన చెందుతున్నా. మన సమాజంలో ఇటువంటి వివక్షకు తావు లేదు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా ఏషియన్.. ఏషియన్ అమెరికన్లకు సంఘీభావం తెలుపుతున్నా’ అని పేర్కొన్నారు. అమెరికా మౌలిక సూత్రాలకు విరుద్ధమైన ఈ వైఖరిని విడిచిపెట్టాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్ తాజాగా పిలుపునిచ్చారు. దీనికి స్పందనగా సత్య నాదెళ్ల టీం ఈ ప్రకటన జారీ చేసింది. గడిచినకొద్దికాలంగా అంతకంతకూ అమెరికన్లకు పట్టిన ఈ మాయరోగం రానున్న రోజుల్లో మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News