నేను గుండాయిజం చేస్తే.. అనిల్ ఆగ్ర‌హం

Update: 2022-04-26 09:30 GMT
ప్ర‌స్తుతం అధికార పార్టీ వైసీపీ నేత‌ల మ‌ధ్య విభేదాల‌తో అక్క‌డి రాజ‌కీయాలు హీటెక్కాయి. మంత్రి ప‌ద‌వి కోల్పోయిన అనిల్ కుమార్ యాద‌వ్‌, తాజాగా కేబినేట్‌లో చోటు ద‌క్కించుకున్న కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి మ‌ధ్య వైరం ముదిరిన సంగ‌తి తెలిసిందే.

దీంతో రెండు వ‌ర్గాలుగా అక్క‌డ పార్టీ విడిపోయింది. మ‌రోవైపు ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డికి, అనిల్ మధ్య విభేదాలున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా అనిల్ ఒక్క‌సారిగా త‌న అస‌హ‌నాన్ని బ‌య‌ట‌కు వ్య‌క్తం చేశారు. ఫ్లెక్సీల వివాదంపై స్పందిస్తూ ఇక‌పై నెల్లూరు సిటీలో ఎవ‌రైనా ఫ్లెక్సీలు క‌ట్టుకోవ‌చ్చ‌ని సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించారు.

ఇటీవ‌ల నెల్లూరు సిటీలో విప‌క్ష పార్టీల‌తో పాటు అధికార నేత‌ల ఫ్లెక్సీలు తొల‌గించ‌డంతో రాద్ధాంతం మొద‌లైంది. వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు వేమిరెడ్డి ప్రభాక‌ర్ రెడ్డి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా నెల్లూరులోని ప‌లు ప్రాంతాల్లో అభిమానులు, అనుచ‌రులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

మ‌రోవైపు దివంగ‌త నేత ఆనం వివేకానంద‌రెడ్డి జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ఆ వ‌ర్గం వాళ్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీట‌న్నింటినీ మునిసిప‌ల్ సిబ్బంది తొల‌గించారు. దీంతో ఫ్లెక్సీల తొల‌గింపుపై ఆ నేత‌ల అనుచ‌రులు తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే తాజాగా అనిల్ స్పందించారు. గ‌త రెండున్న‌రేళ్లుగా సిటీని ఫ్లెక్సీ ర‌హిత న‌గ‌రంగా ఉంచామ‌ని, కానీ ఇప్పుడు వాటిని క‌ట్టొందంటే కొంత‌మంది గొడ‌వ చేస్తున్నార‌ని అనిల్ అన్నారు. అంతే కాకుండా త‌మ పార్టీ నేత‌లే ఈ విష‌యంలో త‌న‌పై విమ‌ర్శ‌లు చేశార‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

త‌న‌కు సీఎం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేవ‌ని కానీ ఇక నుంచి ఫ్లెక్సీల‌పై ఎలాంటి నిబంధ‌న‌లు లేవ‌నేది త‌న నిర్ణ‌య‌మేన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. తాను గుండాయిజం చేస్తాన‌ని కొంద‌రు ఆరోపిస్తున్నార‌ని తాను అలా చేసి ఉంటే ఫ్లెక్సీలు క‌ట్టిన వాళ్ల చేతులు ఉండేవా? అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నెల్లూరు సిటీలో త‌న ఫ్లెక్సీలు క‌ట్ట‌లేద‌ని, ఇకపై కూడా ఏర్పాటు చేయ‌న‌ని స్ప‌ష్టం చేశారు.
Tags:    

Similar News