మాల్యా రూట్లోనే నిరవ్ మోడీ..పారిపోయాడు!

Update: 2018-02-15 17:50 GMT
విజయ్ మాల్యా సీన్ గుర్తుండే ఉంటుంది. జ‌ల్సా రాయుడైన మాల్యా బ్యాంకుల నుంచి 9 వేల కోట్ల రుణాలు తీసుకొని - వాటిని ఎంచక్కా ఎగ్గొట్టి పట్టుకునే లోపే లండన్ పారిపోయాడు. అతను దేశం వదిలి వెళ్లకుండా చూడాలని పలు బ్యాంకులు సుప్రీంకోర్టును ఆశ్రయించేలోపే అతను సేఫ్‌గా దేశం వదిలి వెళ్లిపోయాడు. ఇప్పటికీ అక్కడే ఉంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. అతన్ని తిరిగి తీసుకురావడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. అక్కడే అతన్ని అరెస్ట్ చేశారు. మళ్లీ బెయిల్‌ పై బయట తిరుగుతున్నాడు. ఇలా జంప్ జిలానీ జాబితా భారీగా పెరిగిపోతోంది.

బ్యాంకులకు వేలాది కోట్లు కుచ్చుటోపీ పెట్టి పారిపోయిన పారిశ్రామికవేత్తల జాబితా త‌క్కువేం కాద‌ని ఆర్థిక రంగ నిపుణులు ఇప్పుడు మరికాస్త పెరిగింది. ఇప్పటికే ఇలా నలుగురు విచారణ నుంచి తప్పించుకొని విదేశాల్లో తల దాచుకుంటున్నారు. వీళ్లలో తొలి వ్యక్తి మాల్యా. ఆయ‌న కంటే ముందు లలిత్ మోడీ ఇలాగే యూకే పారిపోయాడు. ఐపీఎల్ చీఫ్‌ గా ఉంటూ కొత్తగా రానున్న కొచ్చి టీమ్ ఓనర్‌ షిప్ వివరాలను నిబంధనలను విరుద్ధంగా బయటపెట్టాడు. ఐపీఎల్లోనూ అక్రమాలకు పాల్పడ్డాడు. ఫెమా చట్టాన్ని ఉల్లంఘించాడన్న నేరం కింద ఈడీ అతనికి నోటీసులు జారీ చేసింది. 2010లోనే భద్రతా కారణాలను చూపుతూ యూకే వెళ్లిపోయాడు. 2011లో అతని పాస్‌ పోర్ట్ రద్దు చేశారు. యూకేలోనే ఉంటూ ఈడీ నోటీసులను అక్కడి కోర్టులో అతడు చాలెంజ్ చేశాడు.

ఇక ఆ త‌ర్వాత కార్పొరేట్ కన్సల్టెంట్ దీపక్ తల్వార్ కూడా ఇలాగే ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌ మెంట్ నుంచి తప్పించుకొని యూఏఈ పారిపోయాడు. యూపీఏ హయాంలో కొందరు సీనియర్ అధికారుల సహకారంతో కొన్ని ఎయిర్‌ లైన్స్ - ఏవియేషన్ కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా మేలు చేశారన్న ఆరోపణలు అతనిపై ఉన్నాయి. కేసులు పెట్టి లోపలేసేలోపే అతను దేశం వదిలి పారిపోయాడు.  ఆయుధాల డీలర్ సంజయ్ భండారీదీ అదే కథ. ఓ పన్ను ఎగవేత కేసులో ఐటీ డిపార్ట్‌ మెంట్ సోదాలు నిర్వహిస్తే రక్షణ శాఖకు సంబంధించిన కీలక పత్రాలు బయటపడ్డాయి. రక్షణ శాఖ కొనుగోళ్లు - డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ముందు ఉంచిన ప్రతిపాదనలు ఆ పత్రాల్లో ఉన్నాయి. ఈ ఏడాది మొదట్లో ఢిల్లీ హైకోర్టు అతన్ని అపరాధిగా తీర్పుచెప్పింది. అయితే అంతకుముందే అతను నేపాల్ మీదుగా విదేశాలకు చెక్కేశాడు.

ఇదే జాబితాలో..పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్‌ లో ప్రధాన నిందితుడైన వజ్రాల వ్యాపారి నిరవ్ మోడీ కూడా ఇప్పటికే ఇండియా వదిలి పారిపోయాడు. స్కాం బయటపడగానే ఈడీ - సీబీఐ రంగంలోకి దిగి మోడీ ఇల్లు, కార్యాలయాలపై దాడులు చేశాయి. కానీ ఈలోపే అతను దేశం వదిలి వెళ్లిపోయాడు. నిరవ్ స్విట్జర్లాండ్‌ కు పారిపోయినట్లు సమాచారం
Tags:    

Similar News