అంటే ముద్ర‌గ‌డ జీరో అయిన‌ట్లేనా.....

Update: 2017-09-02 05:02 GMT

కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుతో ఇప్పుడు కొత్త చర్చ మొద‌లైంది. స‌హ‌జంగానే ఇది టీడీపీ క్యాంపు నుంచే. అయితే ఇది పాజిటివ్ ప్ర‌చారం కాదు...కాపు-బలిజ జాతికి నాయకుడిగా వ్యవహరిస్తూ వారిని బీసీల్లో చేర్చాలంటూ ఉద్యమిస్తోన్న మాజీ మంత్రి - కాపునాడు నేత ముద్రగడ పద్మనాభం గురించి. తెలుగుదేశం క్యాంప్ నుంచి కొత్త‌గా వినిపిస్తున్న చర్చ ఏమంటే...ముద్ర‌గ‌డ‌ ప్రభావం ప్రతిష్ఠాత్మకంగా జరిగిన నంద్యాల - కాకినాడ ఎన్నికల్లో నామమాత్రంగా కూడా కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయిందని అంటున్నారు. చివరకు సొంత జిల్లాలో జరిగిన ఎన్నికల్లో కూడా కాపులు తెలుగుదేశం పార్టీకి జైకొట్టడంతో ముద్రగడ పలుకుబడి పలచబడిందని అంటున్నారు. కాపులు - వారిని వ్యతిరేకించే బీసీలు కూడా టిడిపికే జై కొట్టడం బట్టి, రెండు వర్గాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ - ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఆమోదిస్తున్నట్లు ఫలితాల్లో స్పష్టంగా కనిపించిందని అంటున్నారు.

సొంత తూర్పు గోదావరి జిల్లా కేంద్రంగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని కాపు - బలిజ - ఒంటరి వర్గాలకు నాయకత్వం వహిస్తోన్న ముద్రగడ కార్యక్రమాలకు, అన్ని జిల్లాల నుంచి ఆయా వర్గాలు హాజరవుతున్నారు. కాకినాడ -నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీని ఓడించాలని, ఓడిస్తే తప్ప ఆయన కాపు, బలిజలను బీసీల్లో చేర్చే ప్రయత్నం చేయరంటూ ముద్రగడ తన జాతికి పిలుపునిచ్చారు. కాకినాడ పోలింగుకు ముందువరకూ తన ఇంటి వద్దనే ఆందోళన నిర్వహిస్తూ వచ్చిన ముద్రగడ - హటాత్తుగా కొన్ని కిలోమీటర్లు నడిచి కాకినాడ ఎన్నికల్లో కాపుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. దీనితో కాపుల్లో వ్యతిరేకత వస్తుందని టీడీపీ నాయకత్వం భయపడింది. ఆ పార్టీ కూడా కాపు మంత్రులు - ఎమ్మెల్యేలు - నేతలను డివిజన్ల వారీగా మోహరించింది.

అయితే, ముద్రగడ సొంత జిల్లాలో జరుగుతున్న కాకినాడ ఎన్నికల్లో 25 డివిజన్లను శాసించే  వ‌ర్గాలు ఉన్న కాపులపై ఆయన ప్రభావం ఉంటుందని భావించగా - చివరకు అక్కడా ముద్రగడ పలుకుబడి పలచబడినట్లు ఫలితాలు చాటాయి. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో 25 డివిజన్లలో కాపు వర్గ ప్రభావం క‌ఉంది.కార‌ మొత్తం 18 మంది కాపులు ఈ ఎన్నికల్లో విజయం సాధించగా, అందులో 13 మంది టిడిపి కార్పొరేటర్లు - 5 గురు మాత్రమే వైసీపీ వారుండటం ప్రస్తావనార్హం.  కానీ అక్కడ ఆ వర్గం టీడీపీకే దన్నుగా నిలిచింది. ముద్రగడ వ్యూహాన్ని పసిగట్టిన బాబు - కాపు - బలిజ వర్గాలకు చెందిన సొంత పార్టీ నేతలను పెద్ద సంఖ్యలో ప్రచారానికి దింపి, ఫలితాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో విజయం సాధించారు. దీన్నిబట్టి కాపులపై ఆయన ప్రభావం పనిచేయడం లేదని, ముద్రగడ కార్యకలాపాలకు సొంత సామాజికవర్గంలో మద్దతులేదన్న విషయం స్పష్టమయిందని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నారు. అయితే స్థానిక అంశాలు ఎక్కువ‌గా ప్ర‌భావం చూపే పుర‌పాల‌క ఎన్నిక ఆధారంగా ముద్ర‌గ‌డ స‌త్తాను తేల్చ‌డం అంటే స‌రైనది కాద‌ని అంటున్నారు.
Tags:    

Similar News