టాప్ టెన్నిస్ స్టార్లకు పాజిటివ్.. తాజాగా జొకోవిచ్ దంపతులు

Update: 2020-06-24 04:45 GMT
వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు జొకోవిచ్ తో పాటు ఆయన భార్యకు మాయదారి రోగం అంటేసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా విడుదలైంది. ఆందోళన కలిగించే అంశం ఏమంటే.. ఈ మధ్యనే జొకోవిచ్ ఆధ్వర్యంలో ఆడ్రియా ఎగ్జిబిషన్ లో టెన్నిస్ టోర్నీని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న పలువురు ఆటగాళ్లకు తాజాగా పాజిటివ్ రావటంతో కలకలంగా మారింది.

జొకోవిచ్ దంపతులతో పాటు.. సెర్బియా ఆటగాడు విక్టర్ ట్రివోకి.. గర్భవతిగా ఉన్న ఆయన భార్యకు సైతం పాజిటివ్ గా తేలింది. వీరితో పాటు బల్గేరియాకు చెందిన దిమిత్రోవ్.. క్రోయేషియాకు చెందిన బోర్నా కోరిచ్ లు కూడా పాజిటివ్ గా తేలారు. వీరంతా కలిసి ఇటీవల జరిగిన టోర్నీలో పాల్గొనటం గమనార్హం.
తనతో పాటు తన భార్య.. పిల్లలకు పరీక్షలు చేయించామని.. తామిద్దరికి పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. తాము పద్నాలుగు రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండనున్నట్లు చెప్పారు. ఐదు రోజుల తర్వాత మరోసారి పరీక్షలు చేయించుకున్నామని చెప్పారు. తన ఆధ్వర్యంలో నిర్వహించిన టోర్నీలో పాల్గొనటం ద్వారా మహమ్మారి బారిన పడిన వారికి జొకోవిచ్ క్షమాపణలుచెప్పారు.

ఆడ్రియా టూర్ లో భాగంగా రెండు వారాల క్రితం బల్గేరియాలో జరిగిన తొలి దశ పోటీల్లో పలువురు స్టార్ ఆటగాళ్లు మ్యాచులు ఆడారు. ఈ నేపథ్యంలో జొకోవిచ్ ను పలువురు తప్పు పడుతున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా యుఎస్ ఓపెన్ లో ఆడేందుకు నో చెప్పిన ఈ స్టార్ ఆటగాడు.. తన ఆధ్వర్యంలో నిర్వహించే టోర్నీకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఎంతైనా సొంత యాపారం మీద ఉండే అభిమానం మిగిలిన వాటి మీద ఎందుకు ఉంటుంది చెప్పండి?
Tags:    

Similar News