మోడీ పర్యటనపై పాక్ మీడియా అత్యుత్సాహం

Update: 2015-12-10 05:28 GMT
పాక్ మీడియా అత్యుత్సాహాన్ని ప్రదర్శించింది. కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ ప్రస్తుతం పాకిస్థాన్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్ కు సహాయ సహకారాలు అందించేందుకు వీలుగా.. ‘‘ఆసియా హృదయం’’ పేరిట ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి ఆసియా దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. యుద్ధం.. ఉగ్రవాదం కారణంగా దెబ్బ తిన్న ఆఫ్ఘనిస్తాన్ ను ఎలా ఆదుకోవాలన్న అంశంపై ఈ సదస్సు చర్చిస్తుంది.

ఇదిలా ఉండగా.. పాక్ మీడియా కాస్తంత అత్యుత్సాహానికి పాల్పడింది. ప్రధాని మోడీ.. పాకిస్థాన్ పర్యటనకు వస్తున్నారంటూ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ చెప్పినట్లుగా వార్తలు ప్రసారం చేయటం వివాదాస్పదమైంది. అయితే.. అలాంటి ప్రకటన ఏదీ కేంద్రమంత్రి సుష్మా చేయలేదంటూ భారత అధికారులు స్పష్టం చేస్తున్నారు. వచ్చే ఏడాది పాక్ లో జరిగే సార్క్ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీ హాజరు కానున్నట్లుగా సుష్మ పేరును ప్రస్తావిస్తూ జీయో ఛానల్ కథనం ప్రసారం చేసింది. దీంతో.. మిగిలిన ఛానళ్లు అదే బాటను పట్టినట్లు తెలుస్తోంది. దీనిపై భారత బృందంలోని అధికారులు ఖండిస్తూ.. సుష్మ అలాంటి ప్రకటన ఏమీ చేయలేదని స్పష్టం చేశారు.

మరోవైపు ఆసియా హృదయం సదస్సులో పాల్గొన్న సుష్మా స్వరాజ్ పాకిస్థాన్ కు స్నేహ హస్తాన్ని అందించారు. ప్రపంచం మొత్తం తమ వైపు చూస్తుందని..ఈ సందర్భంగా మరింత పరిణితితోకూడిన సంబంధాలు ఏర్పర్చుకోవాలని చెబుతూ.. ఆఫ్ఘనిస్తాన్ కు సహాయ సహకారాలు అందించేందుకు పాక్ తో కలిసి పని చేయటానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ స్పష్టం చేసింది. మరి.. ఇదంతా మాటలేనా? చేతల వరకూ వెళతాయా? అన్నది కాలమే సమాధానం చెప్పాలి.
Tags:    

Similar News