పాకిస్తాన్ లో కొండెక్కిన కోడి.. ధరలు చూస్తే షాకే..!

Update: 2023-02-16 13:00 GMT
మన పొరుగు దేశం పాకిస్తాన్ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుంది. కరోనా ఎఫెక్ట్.. ఉగ్రవాదం.. రాజకీయ సంక్షోభ పరిస్థితులు ఆ దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాయి. దీనికితోడు గతేడాది పాకిస్థాన్లో వచ్చిన వరదలు.. తీవ్రమైన ఎండలు ఆహార సంక్షోభానికి దారితీశాయి. ఈ పరిస్థితులను కట్టడి చేయాల్సిన పాలకులు రాజకీయాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాక్ పరిస్థితి దివాళా దిశగా వెళుతోంది.

గత కొన్ని నెలల నుంచి పాకిస్తాన్లో ధరలు విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. పాల ఉత్పత్తులు.. వంట గ్యాస్.. గోధమలు వంటి నిత్యావసర సరుకులు గతంలో ఎన్నడూ లేనంతా పెరిగిపోయాయి. ఈ ధరలను చూసి పాక్ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మరోవైపు ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే గోధుమల కోసం ప్రజలు బారులు తీరడంతో కొన్నిప్రాంతాల్లో తొక్కిసలాటలు జరిగి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి.

పాకిస్తాన్ చరిత్రలో తొలిసారి ధరలు గరిష్ట స్థాయిని తాకాయి. దీంతో ప్రజలు రోజువారీ కనీస నిత్యావసర వస్తువులను సైతం కొనలేని పరిస్థితులు దాపురించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తాజాగా పెట్రోల్ పై 22 పెంచడంతో లీటర్ పెట్రోల్ 272 రూపాయలకు చేరింది.

అలాగే డీజిల్ పై రూ.17.20 పెంచడంతో లీటర్ డీజిల్ ధర రూ.280కి చేరింది. ఈ ప్రభావం నిత్యావసర వస్తువులపై మరింతగా పడుతోంది.

డాలర్ తో పాక్ రూపాయి విలువ క్షీణించడంతో ఈ పెరుగుదల కన్పిస్తుందని పాక్ ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పెరిగిన ధరలతో ప్రజలు అల్లాడుతుంటే ములుగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నట్లుగా ప్రజలపై భారం మోపుతోంది. దీంతో పేద.. సామాన్య ప్రజలు ఏమి కొనే పరిస్థితి లేక పస్తుండాల్సిన దుస్థితి ఆ దేశంలో నెలకొంది.

తాజా సమాచారం మేరకు పాకిస్తాన్ లో లీటర్ పాల ధర 210కి పెరిగింది. కిలో కోడి మాంసం ధర ఏకంగా రూ.780 పలుకుతోంది. బోన్ లెస్ చికెన్ ధర రూ.1100లు పలుకుతోంది. కిలో కోడి ధర రూ.490కి చేరింది. పాకిస్తాన్ చరిత్రలో చికెన్ ధర ఇంతలా పెరగడం ఇదే తొలిసారి.

పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి చూస్తుంటే ఇటీవల దివాళా తీసిన శ్రీలంకను తలపిస్తోంది. మరోవైపు పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు 1998 సంవత్సరం కంటే కనిష్టానికి పడిపోవడం గమనార్హం.

Similar News