ప‌వ‌న్ గొంతు మూగ‌బోయిందా.. ఎందుకు నీకు రాజ‌కీయం?

Update: 2022-02-03 07:59 GMT
రాజ‌కీయ నాయ‌కులంటే ఎప్పుడూ ఏదో విష‌యంపై మాట్లాడుతూ ప్ర‌జ‌ల్లో ఉండాలి. అధికారంలో ఉంటే విప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చేందుకు.. అదే ప్ర‌తిప‌క్షంలో ఉంటే అధికార ప్ర‌భుత్వ వైఫల్యాల‌ను ఎండ‌గ‌ట్టేందుకు.. ఇలా ఎప్పుడూ ఏదో ఒక దాని మీద స్పందిస్తూ ఉండాలి. అప్పుడే ప్ర‌జల నాలుక‌ల్లో ఆ నాయ‌కుడి పేరు నానుతుంది. కానీ ప్ర‌శ్నించ‌డానికే రాజకీయాల్లోకి వ‌చ్చానంటూ ప్ర‌క‌టించిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్ మాత్రం ఆ విష‌యాన్నే మ‌ర్చిపోయారంటూ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. గ‌త కొంత‌కాలంగా ఆయ‌న పూర్తిగా సైలెంట్ అయిపోయార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఆందోళ‌న‌లో ప్ర‌జ‌లు..

ఏపీలో జ‌న‌రంజ‌క పాల‌న సాగుతుంది.. ప్ర‌జ‌ల‌కు ఏ ఇబ్బందులు లేవని అనుకుంటే అప్పుడు ప్ర‌త్య‌ర్థి పార్టీలు సైలెంట్‌గా ఉండ‌డంలో అర్థం ఉంది. కానీ ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎక్క‌డ చూసినా స‌మ‌స్య‌లే క‌నిపిస్తున్నాయి. అన్ని విధాలుగా రాష్ట్రం ఇబ్బంది ప‌డుతోంది. పీఆర్సీ విష‌యంపై ప్ర‌భుత్వ ఉద్యోగులు స‌మ్మెకు సిద్ధ‌మ‌య్యారు. ప్ర‌భుత్వం ఎన్ని ర‌కాలుగా బెదిరించినా త‌గ్గేదేలే అన్న‌ట్లు ఈ నెల 6 అర్ధ‌రాత్రి నుంచి స‌మ్మెకు సిద్ధం అంటున్నారు. మ‌రోవైపు నిరుద్యోగం పెరుగుతోంది. ఉద్యోగాల కోసం యువ‌త క‌ళ్లు కాయ‌లు కాసేలా ఎదురు చూస్తోంది. మ‌రోవైపు ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా రాష్ట్రంలో అభివృద్ధి ప‌డ‌కేసింద‌ని నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఎన్నో స‌మ‌స్య‌లు..

రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్న‌ప్ప‌టికీ సీఎం జ‌గ‌న్ మాత్రం సంక్షేమ ప‌థ‌కాల పేరుతో ప్ర‌జ‌ల‌కు డ‌బ్బులు పంచిపెడుతున్నార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. దీంతో అభివృద్ధికి నిధులు లేకుండా పోయాయ‌ని వైసీపీ నేత‌లే బ‌హిరంగంగా అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా వైసీపీ మంత్రి కొడాలి నాని క్యాసినో వ్య‌వహారం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు విజ‌య‌వాడ బాలిక మృతి అంద‌రినీ క‌లచివేస్తోంది. కానీ ప‌వ‌న్ మాత్రం వీటితో ఏం సంబంధం లేద‌న్న‌ట్లు అస‌లు తాను రాజకీయ నాయకుడ‌నే విష‌యాన్ని మ‌ర్చిపోయి వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే మాట‌లు వినిపిస్తున్నాయి.

మౌనంలో అర్థ‌మేంటీ?

రాష్ట్రంలో ప్ర‌స్తుత ప‌రిణామాల నేప‌థ్యంలో సాధార‌ణ జ‌నాలే తీవ్రంగా స్పందిస్తున్నారు. అలాంటిది ప్ర‌జ‌ల కోసం రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ప‌వ‌న్ మాత్రం సైలెంట్‌గా ఉండిపోతున్నారు. దీంతో ఇక ఆయ‌న‌కు రాజ‌కీయాలు ఎందుక‌నే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. విశాఖ ఉక్కు, సినిమా టికెట్ల ధ‌ర‌ల‌పై గ‌తంలో గొంతెత్తిన ఆయ‌న ఆ త‌ర్వాత చాలా రోజుల‌గా మిన్న‌కుండిపోయారు. అస‌లు ఏ విష‌యంపైనా స్పందించ‌డం లేదు. ఇదేనా ప్ర‌జ‌ల గొంతుక‌గా ఉంటాను అన‌డంలో అర్థ‌మ‌ని ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేయ‌ని నాయ‌కుడికి మూడ్ వ‌చ్చిన‌ప్పుడు మాత్రమే ఆవేశంతో జ‌నాల్లోకి వ‌స్తార‌ని ప‌వ‌న్‌పై చెడ్డ‌పేరు వ‌స్తోందనే టాక్ ఉంది. మ‌రి జ‌నసేనాని  ఎప్ప‌టికి స్పందిస్తారో? తిరిగి ఎప్పుడు యాక్టివ్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News