ఐఐటీ గ్రాడ్యుయేట్, రూ.24 లక్షల ప్యాకేజీ, ఈ పని చేశాడా..?

Update: 2021-11-12 04:42 GMT
ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా.. ఒక్క అవలక్షణం చాలు నాశనమైపోవటానికి. ఈ మాట ఎంత నిజమో.. తాజాగా చోటు చేసుకున్న ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. టీ20 వరల్డ్ కప్ లో పాక్ చేతిలో టీమిండియా ఓడిన నేపథ్యంలో.. తొమ్మిది నెలలున్న కోహ్లీ కుమార్తె వామికాపై దారుణ రీతిలో వ్యాఖ్యలు చేస్తూ పోస్టు చేసిన ట్వీట్ పెను సంచలనంగా మారటమే కాదు.. పెద్ద ఎత్తున విమర్శల్ని సొంతం చేసుకుంది. ఈ దారుణ ట్వీట్ ను పోస్టు చేసిన హైదరాబాద్ కు చెందిన వ్యక్తిని తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకోవటం తెలిసిందే.

ఇతగాడికి సంబంధించిన వివరాల్ని చూసినప్పుడు ముక్కున వేలేసుకోవాల్సిందే. సంగారెడ్డికి చెందిన రామ్ నగేష్ ఈ దారుణ వైనానికి పాల్పడినట్లుగా గుర్తించారు. ఇతడ్ని అరెస్టు చేసిన తర్వాత విచారణలో పోలీసులకు విస్తుపోయే విషయాల్ని గుర్తించారు. బెంగళూరుకు చెందిన ఒక ఫుడ్ యాప్ లో ఐటీ ఇంజినీర్ గా పని చేసే ఇతను రూ.24 లక్షల వార్షిక ప్యాకేజీతో పని చేస్తాడని గుర్తించారు. సభ్య సమాజం ఏ మాత్రం అంగీకరించలేని రీతిలో ట్వీట్ చేసిన ఇతడ్ని ముంబయి సైబర్ క్రైమ్ పశ్చిమ విభాగానికి చెందిన పోలీపులు సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారంలోని ఓడీఎఫ్ క్వార్టర్స్ లో రామ్ నగేశ్ ను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు.

అతడిపై ఐపీసీ సెక్షన్ 354(ఏ).. 506.. 67(బీ) కింద అభియోగాలు మోపారు. ఇతడ్ని అదుపులోకి తీసుకున్న తర్వాత.. గతంలోనూ ఇలాంటి పనులు చేశాడా? ఎందుకిలా చేశాడు? అతని వ్యక్తిగత ప్రవర్తన ఎలా ఉంటుంది? లాంటి అంశాలపై పోలీసులు ఫోకస్ చేశారు. ఐఐటీ హైదరాబాద్ లో రెండేళ్ల క్రితం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇతడు ఏడాదికి రూ.24 లక్షల ప్యాకేజీతో జాబ్ చేశాడు. అమెరికాకు వెళ్లాలన్న ఉద్దేశంతో నెల క్రితమే జాబ్ మానేశాడు. క్రికెట్ ను అమితంగాఇష్టపడే ఇతను ఇంతటి దారుణమైన రీతిలో ట్వీట్ చేయటాన్ని అతని తండ్రి జీర్ణించుకోలేకపోతున్నారు.

చదువుల్లో టాప్ అయిన రామ్ నగేశ్.. ఇలా ఎందుకు చేశాడన్నది అర్థం కాక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అతడి తల్లిదండ్రులు. చదువుల్లో టాప్ అయిన రామ్ నగేశ్ అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అతని సన్నిహితులు చెబుతున్నారు. 9 నెలల కోహ్లీ కుమార్తెపై చేసిన దారుణ వ్యాఖ్యలతో కూడిన ట్వీట్ కావాలని జరగలేదని.. పొరపాటున పోస్టు చేసినట్లు చెబుతున్నా.. అదే నిజమైతే మరుక్షణం డిలీట్ చేయొచ్చు కదా? అన్న ప్రశ్న వినిపిస్తోంది.

అంతేకాదు.. తనను ఎవరూ పట్టుకోరన్న ఉద్దేశంతో పాక్ జాతీయుడిగా గుర్తింపు ఐడీలతో అతడు ఈ పని చేస్తున్నట్లుగా గుర్తించారు. గతంలోనూ వేధింపులకు గురి చేసినట్లుగా అనుమానిస్తున్నారు. అతడ్ని పూర్తిస్థాయిలో విచారిస్తే.. మరిన్ని వివరాలు బయటకు వస్తాయన్న మాట వినిపిస్తోంది. ఇక.. అతడి స్నేహితులు మాట్లాడుతూ.. అతను చేసింది పెద్ద తప్పు అయిన.. ట్వీట్ పోస్టు చేసిన తర్వాత భయపడ్డాడనని.. వెంటనే డిలీట్ చేసే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదని.. అంతలోనే అది కాస్తా వైరల్ అయినట్లుగా చెబుతున్నారు. హద్దులు దాటటం ఎందుక.. ఆ వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టటం ఏమిటి? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News