ఆరెస్సెస్ సంచలన వ్యాఖ్యలు...మోడీ సర్కార్ మీదేనా...?

Update: 2022-10-03 10:12 GMT
బీజేపీకి మాతృ సంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సంఘ్ ఎపుడూ దిశా నిర్దేశం  చేస్తూ ఉంటుంది. తమకు రాజకీయాలతో సంబంధం లేదని చెబుతూనే బీజేపీ అడుగుజాడలను అవసరమైనపుడు పరికిస్తూ డైరెక్షన్ ఇస్తూంటుంది. ఇక ఆరెస్సెస్ విషయం తీసుకుంటే సంఘ్ విధానపరమైన  పంధా వేరు, రాజకీయ వేరు. ప్రాక్టికాలిటీ చూస్తే రాజకీయాలు చేసేటపుడు సిద్ధాంతాలను అనుకున్నట్లుగా అమలు చేయలేరు. అక్కడ ఎన్నో ప్రతిబంధకాలు కనిపిస్తాయి.

అయినా సరే ఆరెస్సెస్ నిర్మొహమాటంగా తాను అనుకుంటున్నది చెబుతూనే ఉంటుంది. గతంలో కూడా వాజ్ పేయ్ ప్రభుత్వంలో లోపాలను ఆరెస్సెస్ ఎప్పటికప్పుడు బయట పెడుతూ వచ్చింది. కొన్ని సార్లు బాహాటంగా కాస్తా తీవ్రంగా స్పందించిన ఉదాహరణలు ఉన్నాయి. ఇపుడు కూడా అలాంటి సంచలన వ్యాఖ్యలే మోడీ సర్కార్ మీద ఆరెస్సెస్ చేసిందా అన్న చర్చ అయితే సాగుతోంది.

ఏలిన వారు ఎపుడూ అంతా బాగుందని అనుకుంటారు.ఎనిమిదిన్నర ఏళ్ళ పాలనలో బీజేపీ బాగానే చేశాను అని భావిస్తోంది. దేశం వెలిగిపోతోంది అని కూడా చెబుతూ వస్తోంది. ఈ దేశంలో పేదరికం లేదని, అంతా అంబానీ ఆదానీలే అని కూడా భ్రమల్లో ఉన్నా ఉండవచ్చు. కానీ అసలు గుట్టు ఏంటో మాతృ సంస్థ ఆరెస్సెస్ విప్పి చెప్పింది అనుకోవాలి.

లేటెస్ట్ గా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్ నిర్వహించిన ఆన్‭లైన్ సమావేశంలో  జనరల్ సెక్రెటరీ దత్తాత్రేయ హొసబలే దేశంలోని పేదరికం, అంతకంతకు పెరిగిపోతున్న నిరుద్యోగం మీద సంచలన వ్యాఖ్యలే చేశారు. ఈ దేశంలో ఇంకా ఇరవై కోట్ల మంది పేదరికంతో మగ్గుతున్నారని కఠిన సత్యాలని ఆయన వెళ్లగక్కారు. అలాగే ఈ దేశంలో మరో 25 కోట్ల మంది ప్రజల రోజు వారి ఆదాయం 375 రూపాయల కంటే తక్కువగా ఉందంటే ఎలా అర్ధం చేసుకోవాలి అని ఆయన ప్రశ్నించడం విశేషం.

ఇలా దేశంలో ఆర్ధిక అసమానతలు ఉన్నాయని, . పేదరికం అనేది ఒక దెయ్యం మాదిరిగా ఈ దేశాన్ని ఆవహించిందని దత్తాత్రేయ హాట్ కామెంట్స్ చేశారు. ఆ పేదరికం అనే దెయ్యాన్ని ఇంకా చంపలేకపోతున్నామని ఆయన విమర్శించారు. మోడీ సర్కార్ ఆత్మ నిర్భర్ భారత్ కోసం  ఎఫ్‌పిఓ, జన్‭ధన్ వంటి ఇతర కార్యక్రమాలను, ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ విప్లవాలు వంటి చర్యలను ఎన్నో తీసుకుందని ఆయన చెబుతూనే మూడవ వంతు మంది దేశ జనాభా పేదరికంలో ఉందని ఘాటైన వ్యాఖ్యలు చేయడాన్ని కచ్చితంగా గమనించాలి.

ఆరెస్సెస్ నేత అన్న మాటలను బట్టి తీసుకుంటే ఈ దేశంలో పేదరికం నిర్మూలనకు మోడీ సర్కార్ చేసిన చర్యలు ఏ మాత్రం సరిపోవు అన్న అర్ధం వచ్చేలా ఉన్నాయని అంటున్నారు. నిజానికి ఎనిమిదిన్నరేళ్ళ కాలం చాలా సుదీర్ఘమైనదే. అదే టైంలో ఈ దేశంలోని ధనవంతులు ఇంకా పెరిగారు. అపర కుబేరులు కూడా ఎక్కువ అయ్యారు. ప్రపంచ కుబేరులతో భారత్ లోని వారు పోటీ పడుతున్నారు. మరి పేదలు వారి పరిస్థితి ఏంటి అన్నది ప్రభుత్వం ఆలోచన చేసిందా అన్న చర్చ ఒక వైపు నడుస్తోంది.

దానికి మద్దతుగా అన్నట్లుగా ఆరెస్సెస్ నేత దత్తాత్రేయ చేసిన ఈ సంచలన కామెంట్స్ ని చూడాలని అంటున్నారు. ఏది ఏమైనా ఏలిన వారు  చెబుతున్నట్లుగా ఈ దేశం పెద్దలు, ధనవంతులుతోనే  అంతా ఉన్నది అయితే కాదు. ఇపుడు గురువు లాంటి ఆరెస్సెస్ చెప్పింది కాబట్టి పేదరికం అనే దెయ్యాన్ని పారదోలడానికి బీజేపీ వద్ద ఉన్న ప్లాన్స్ ఏంటో బయటకు తీసి అమలు చేస్తే బాగుంటుందేమో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News