షా వద్దు..శివరాజ్ ముద్దు..బీజేపీ అసమ్మతి

Update: 2019-01-07 10:18 GMT
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర ఓటమితో బీజేపీలో ముసలం మొదలైంది. ఇన్నాళ్లు మోడీషాల ప్రభంజనానికి నోరుమూసుకున్న వారందరూ ఇప్పుడు గళమెత్తుతున్నారు.తాజాగా ఉత్తర ప్రదేశ్ బీజేపీ సీనియర్ నాయకులు - కేంద్ర మాజీ మంత్రి సంఘ్ ప్రియ గౌతమ్.. మోడీషాలపై విరుచుకుపడ్డారు. ఐదురాష్ట్రాల ఓటమికి మోడీషాలదే బాధ్యత అని.. లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ మేజిక్ పనిచేయలేదని స్పష్టం చేశారు.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలవాలంటే మోడీషాలను బాధ్యతల నుంచి తొలగించాలని సంఘ్ ప్రియ గౌతమ్ స్పష్టం చేశారు. మెరుగైన నాయకులను వారి సీట్లో కూర్చుండబెట్టాలని సూచించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన బహిరంగ లేఖ రాయడం బీజేపీలో కలకలం రేపింది.

ఆ లేఖలో బీజేపీ అధ్యక్షుడిగా అమిత్ షాను తొలగించి.. ఆయన స్థానంలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి  - పార్టీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ ను నియమించాలని సూచించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని ఉప ప్రధానిగా నియమించాలని డిమాండ్ చేశారు. యూపీ సీఎం యోగి కూడా విఫలమయ్యారని.. కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు బాధ్యతలు అప్పగించాలని కోరారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మోడీ మంత్రం - అమిత్ షా చాణక్యం పనిచేయదని స్పష్టం చేశారు.

2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలవడం - మోడీ ప్రధాని కావడం ఖాయమని గౌతమ్ చెప్పుకొచ్చారు. అలా జరగాలంటే పలు మార్పులు - చేర్పులు జరగాలని సూచించారు. కాగా .. గౌతమ్ రెండు సార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. అటల్ బిహారీ వాజ్ పేయి హయాంలో కేంద్రమంత్రిగా ఉన్నారు.


Full View

Tags:    

Similar News