దుర్గమ్మ దర్శనానికి ఏర్పాట్లు ... రూల్స్ ఇవే !

Update: 2020-05-15 12:15 GMT
ఆంధ్రప్రదేశ్ లో లాక్‌ డౌన్ నిబంధనలు మరింతగా సడలిస్తే దేవాలయాల్లో భక్తులను అనుమతించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ఆలయాల్లో 50 రోజులుగా దర్శనాలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనితో దైవ దర్శనాల కోసం రాష్ట్ర ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలోనే ఇప్పటికే తిరుమలలో శ్రీవారి దర్శనానికి టీటీడీ ఈ రకమైన కసరత్తు మొదలుపెట్టగా... తాజాగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ దర్శనానికి సైతం ఇదే రకమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కొండపై లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారి దర్శనం చేసుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయానికి భక్తులు దర్శనానికి వచ్చే సమయంలో నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. భౌతిక దూరం పాటిస్తూ అమ్మవారి దర్శనానికి వెళ్లాలి. అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే టిక్కెట్లను ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవాలి. ఎస్ ఎమ్మెస్ ద్వారా టైమ్ స్లాట్ బుక్ చేసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేశారు.

24 గంటల ముందుగానే స్లాట్ బుక్ చేసుకునేలా ఏర్పాట్లను దేవస్థానం అధికారులు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతించాలని, గంటకు 250 మంది భక్తులకు మించకుండా దర్శనం కలిగించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆధార్ నెంబర్‌ తో సహా దర్శన సమయాన్ని ఎస్ ఎమ్మెస్‌ లలో భక్తులు తెలపాలన్నారు. అయితే అంతరాలయ దర్శనం, శఠగోపం, తీర్థం పంపిణి నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Tags:    

Similar News