యాకూబ్ ఉరిశిక్షపై ఎటూ తేల్చని సుప్రీం

Update: 2015-07-27 09:04 GMT
1993 ముంబయి దాడుల నిందితుడు యాకూబ్ మెమెన్ ఉరిశిక్షపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇంకో మూడు రోజుల్లో మెమెన్ కు ఉరి పడాల్సి ఉంది. ఐతే ఇంతలో అతను క్షమాభిక్ష్ ప్రసాదించమంటూ చేసిన చివరి ప్రయత్నంపై సుప్రీం ఏమంటుందో సోమవారం తేలిపోతుందని అంతా భావించారు. కానీ సుప్రీం కోర్టు ఈ పిటిషన్ విచారణకు ఒక్క రోజు సరిపోదని భావించింది. వివిధ అంశాలతో ముడి పడి ఉండటంతో విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఒకవేళ రేపు కూడా విచారణ పూర్తి కాని పక్షంలో 30న జరగాల్సిన ఉరి కార్యక్రమాన్ని వాయిదా వేస్తారేమో అన్న సందేహాలు నెలకొంటున్నాయి. ఎందుకంటే ఉరికి మధ్యలో ఒకే ఒక్క రోజు మిగిలి ఉంటుంది.

తనకు విధించిన ఉరి శిక్షపై చిట్టచివరి ప్రయత్నంగా వేసిన క్యురేటివ్ పిటిషన్ పై  సుప్రీం కోర్టులో విచారణ పెండింగ్ లో ఉండగా.. టాడా కోర్టు డెత్ వారెంట్ జారీ చేయడంపై మెమెన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. జులై 30న తనను ఉరితీయాలన్న టాడా కోర్టు ఆదేశాలు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని అతను వాదించాడు. ఐతే క్యురేటివ్ పిటిషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో తాజాగా క్షమాభిక్ష పిటిషన్ వేశాడు మెమెన్. 1993 నాటి ముంబయి దాడులకు ప్రధాన సూత్రధారుల్లో ఒకడిగా మెమెన్ అభియోగాలు ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో అతను ఆయుధం చేతబట్టి తిరుగుతున్న ఫొటోలు బయటికి రావడంతో పాటు సాక్ష్యాలు బలంగా ఉండటంతో ఉరి శిక్ష పడింది. ఈ కేసులో ఉరి శిక్ష పడిన ఏకైక ఖైదీ మెమెనే.
Tags:    

Similar News