ముచ్చటగా మూడోసారి.. ఇలాంటి లక్ తలసానికే సొంతం!

Update: 2022-07-02 05:00 GMT
చాలామంది నేతలు ఉంటారు. కానీ.. అదృష్టవంతులైన రాజకీయ నేతలు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి వారిలో తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని ముందుంటారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉంటే మంత్రుల్లో ఆయన ఒకరు. ప్రగతిభవన్ కు నేరుగా వెళ్లి.. సీఎంను కలిసి వచ్చే అతితక్కువ మందిలో ఆయన ఒకరుగా చెబుతుంటారు. కేసీఆర్ రాజకీయ జీవితాన్ని నిశితంగా పరిశీలిస్తే.. ఎవరైనా నేతను అక్కున చేర్చుకుంటే.. కొద్ది నెలల తర్వాత ఆయన్ను దూరం పెట్టే గుణం కనిపిస్తుంటుంది.

చాలామంది విషయంలో అలా జరిగింది కూడా. అందుకే కేసీఆర్ కు సన్నిహితంగా ఉండటానికి కొందరు నేతలు జంకుతారు. ఇప్పుడు సన్నిహితంగా ఉంటాం సరే.. ఆ తర్వాత సంగతేమిటన్నట్లుగా వారి వ్యాఖ్యలు ఉంటాయి.

అయితే.. సీఎం కేసీఆర్ మనసును ఎప్పటికప్పుడు గెలుచుకోవటం.. ఆయన ప్రాధాన్యత క్రమంలో తన స్థానం మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవటంలో తలసానికి మించినోళ్లు లేరనే చెబుతారు.

పార్టీ మారిన వెంటనే పదవులు చాలా తక్కువ మందికి లభిస్తాయి. తలసాని అయితే.. పార్టీ మారిన గంటల వ్యవధిలోనే మంత్రి పదవి ఆయన ఒళ్లోకి వచ్చి వాలటం.. అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరుగులేని అధిక్యతను ప్రదర్శిస్తూ దూసుకెళ్లటం చూస్తున్నదే.

అలాంటి తలసానికి సుడే సుడి అన్న మాటలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం.. తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వాగతం పలికే అవకాశం మరోసారి ఆయనకు దక్కటమే.

ప్రధాని మోడీ మీద గుర్రుగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన్ను కలిసేందుకు.. ఆయనతో వేదికను పంచుకునే విషయంలో ఆసక్తి చూపించకపోవటమే కాదు.. సదరు కార్యక్రమాలకు డుమ్మా కొడుతున్న వైనం తెలిసిందే. ఈ క్రమంలో ప్రోటోకాల్ ప్రకారం.. ప్రధానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వాగతం పలికేందుకు వీలుగా మంత్రి తలసానిని ఎంపిక చేయటం తెలిసిందే. ఈ ఏడాదిలో ఇప్పటికి మూడోసారి ప్రధాని మోడీకి స్వాగతం పలికే అరుదైన అవకాశాన్ని తలసాని సొంతం చేసుకున్నారు. ఈ విషయంలో తలసాని అంత అదృష్టవంతుడు మరొకరు ఉండరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News