ఎస్సైల సూసైడ్‌..స‌ర్కారు మేలుకుంది

Update: 2017-08-31 13:40 GMT
దేశంలోనే బెస్ట్‌ పోలీస్‌ గా కీర్తి పొందిన తెలంగాణ‌ రాష్ట్ర పోలీసు శాఖ ప్రతిష్టను జాతీయ స్థాయిలో దిగజార్చేలా మారిన సంఘ‌ట‌న‌ల‌పై ఎట్ట‌కేల‌కు ఇటు ప్ర‌భుత్వం అటు పోలీసు ఉన్న‌తాధికారులు న‌జ‌ర్ పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో గత మూడేల్ల‌ కాలంలో ఏడుగురికి పైగా సబ్‌ ఇన్‌ స్పెక్టర్‌ లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ముఖ్యంగా ఇటీవల సిద్దిపేట కమిషనరేట్‌ పరిధిలోని కుక్కునూరుపల్లి పోలీసు స్టేషన్‌ ఎస్‌ ఐ ప్రభాకర్‌ రెడ్డి తన ఇంట్లో సర్వీస్‌ రివాల్వర్‌ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం, బ్యూటీషియన్‌ శిరీష ఆత్మహత్య ఘటనలో అతనిపై వచ్చిన ఆరోపణల కంటే ఉన్నతాధికారులు లంచం కోసం ఎస్‌ ఐపై తీసుకు వచ్చిన ఒత్తిడిని భరించలేకే ఆత్మహత్యకు పాల్పడినట్టు బలమైన ఆరోపణలు అతని కుటుంబసభ్యులు - ఇతర ఎస్‌ ఐ వర్గాల నుంచి వచ్చాయి. ఈ తీరులోనే కెకెపల్లికి చెందిన మరో ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి - అదిలాబద్‌ ఎస్‌ ఐ శ్రీధర్‌ - కరీంనగర్‌ ఎస్‌ఐ సురేందర్‌ రెడ్డి - యాలాల్‌ ఎస్‌ ఐ రమేష్‌ - దుబ్బాక ఎస్‌ ఐ చిట్టిబాబు మొదలైన వారు వివిధ కారణాల చేత ఆత్మహత్యలకు పాల్పడటం పోలీసు రాష్ట్ర హోంశాఖను కుదిపేసింది.

వీటితోపాటు అనేక సందర్భాలలో పోలీసు అధికారులు - సిబ్బంది వివిధ సమస్యలపై నిరసన తెలిపే ఆందోళన కారులు - మరో వైపు వివిధ కేసుల్లో అదుపులోకి తీసుకున్న నిందితులు - అనుమానితులపై అదుపు తప్పి బలప్రయోగం చేయడం వంటి చర్యలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. నాయకత్వ శ్రేణిలో ఉన్న ఎస్‌ ఐ స్థాయి అధికారులు ఆవేశంతోనో  - భావోద్వేగంతోనో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పోలీసు వర్గాల్లో వినిపిస్తోంది. పోలీసులలో విధి నిర్వహణ పరంగా ఎదురవుతున్న మానసిక - శారీరక వత్తిడులను శాస్త్రీయంగా విశ్లేషించడానికి శాస్త్రీయమైన క్వశ్చనీర్‌(ప్రశ్నావళి)ని పోలీసు ఉన్నతాధికారులు రూపొందించారు. దీని ద్వారా పోలీసుల మానసిక స్థితిని అంచనా వేసి దానికి తగిన కౌన్సెలింగ్‌ ను నిపుణుల ద్వారా ఇప్పించనున్నారు. దీనికి సంబంధించిన సమగ్ర కార్యాచరణను ఆర్‌ బీవీఆర్‌ పోలీసు అకాడమి డైరెక్టర్‌ - అదనపు డీజీ జితేందర్‌ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ తయారు చేసింది. విధినిర్వహణతో పాటు వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా ఎలాంటి ఒత్తిడిలను ఎస్‌ ఐలు,ఆ పై అధికారులు ఎదుర్కొంటున్నది అంచనా వేయడం, దీని ద్వారా తేలిన అంశాలపై తగిన కౌన్సిలింగ్‌ ను ఎలా నిర్వహించాలన్న కోణంలో జితేందర్‌ కమిటీ ఒక కార్యాచరణను రూపొందించింది. దాని ప్రకారం ఒక పైలెట్‌ దశగా ఒక కార్యాచరణను ఈ కమిటీ రూపొందించింది.

రాష్ట్రంలోని ప్రతి ఎస్‌ ఐకి శాస్త్రీయంగా రూపొందించిన ఒక క్వశ్చనీర్‌(ప్రశ్నావళి)ని అందచేస్తారు. అందులో విధినిర్వహణ క్రమం నుంచి వ్యక్తిగత అంశాల వరకు పలు ప్రశ్నలకు ఎస్‌ ఐలు ఇచ్చే సమాధానాలను ఒక్కొక్కటిగా నిపుణులతో విశ్లేషిస్తారు. వారిచ్చిన రిపోర్టు ఆధారంగా ఒక్కో గ్రూపులో 25 మంది ఎస్‌ ఐలను ఎంపిక చేసి వారికి కౌన్సిలింగ్‌ ను నిర్వహిస్తారు. అందులో తేలే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని అవసరమైన వారికి వైద్య పరీక్షలు - తర్వాత చికిత్సను కూడా చేయిస్తారు ఈ కౌన్సెలింగ్‌ ను నిర్వహించడానికి నాలుగు సెంటర్‌ లు అంబర్‌ పేట్‌ సీపీఎల్‌ - యూసుఫ్‌ గూడ ఫస్ట్‌ బెటాలియన్‌ - సిద్దిపేట్‌ - మేడ్చల్‌ లలో నాలుగు సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు వందలకు పైగా సబ్‌ ఇన్‌ స్పెక్టర్‌ లకు ఈ విధానం ద్వారా వారిలో ఎమోషనల్‌ - ఫీజికల్‌ - మెంటల్‌ స్ట్రెస్‌ లను అంచనా వేసి తగిన కౌన్సెలింగ్‌ ను ఇవ్వనునన్నారు. పైలెట్‌ దశలో నాలుగు సెంటర్‌ లను ఏర్పాటు చేస్తున్నామని, తర్వాత వాటిని విస్తరించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ ప్రక్రియను ప్రముఖ మానసిక నిపుణులతో పాటు పేరుమోసిన వైద్యులను కూడా భాగస్వామ్యం చేసి క్వశ్చనీర్‌ ను రూపొందించారు. ఎస్‌ఐల అనంతరం ఇన్‌ స్పెక్టర్లు - డీఎస్‌ పీలకు కూడా ఈ విధానాన్ని అమలు చేసే యోచన ఉందన్నారు. అలాగే కింది స్థాయి కానిస్టేబుళ్ళు - హెడ్‌ కానిస్టేబుళ్లు - ఏఎస్‌ ఐలకు కూడా క్వశ్చనీర్‌ ద్వారా వారిలోని మానసిక స్థితిగతులను అంచనా వేసి తదుపరి కార్యాచరణను రూపొందించే యోచనలో డీజీపీ అనురాగ్‌ శర్మ ఉన్నారని స‌మాచారం.
Tags:    

Similar News