మద్యం.. తెలంగాణ రికార్డు అందుకోలేకపోయిన ఏపీ!

Update: 2023-01-02 04:15 GMT
ఇటీవల మునుగోడు ఎన్నిక సందర్భంగా ఏకంగా రూ.300 కోట్ల మద్యం ఏరులై పారింది. తద్వారా ఆ ఒక్క ఉప ఎన్నిక దేశంలోనే రికార్డు సృష్టించింది. తెలంగాణలోనే అత్యధికంగా ఒక రోజు మద్యం అమ్మకాల్లో మునుగోడు ఎన్నిక కూడా చోటు దక్కించుకుంది.

ఇక ఇప్పుడు కొత్త సంవత్సరం సందర్బంగా మరోమారు తెలంగాణ మద్యం అమ్మకాల్లో రికార్డులు సృష్టించింది. మద్యం అమ్మకాల్లో ఏపీ కంటే తెలంగాణ ముందంజలో నిలిచింది.

నూతన సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు డిసెంబర్‌ 31వ తేదీ తెల్లవారుజామున 1 గంటల వరకు మద్యం అమ్మకాలను పొడిగించాయి. బార్లు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు మందు బాబులతో కళకళలాడాయి. ఫలితంగా, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఆదాయాన్ని కొల్లగొట్టాయి.

డిసెంబర్‌ 31న ఏపీలో రూ.127 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని సమాచారం. సాధారణ పనిదినాల్లో విక్రయాలు రూ.72 కోట్లకు చేరుకోగా, డిసెంబర్‌ 29, 30, 31 తేదీల్లో వరుసగా రూ.72.3 కోట్లు, రూ.86 కోట్లు, రూ.127 కోట్ల విక్రయాలు జరగడం గమనార్హం. మూడు రోజుల మొత్తం అమ్మకాలు రూ. 285.3 కోట్లు.

మరో రెండు వారాల్లో సంక్రాంతి పండుగ ఉంది. ఈ సందర్భంగా కూడా ఇదే తరహా విక్రయాలు ఉంటాయని ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో మరోమారు ఏపీ ప్రభుత్వ ఖజానా మద్యం ఆదాయాలతో గలగలలాడటం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక ఆంధ్రప్రదేశ్‌ లో పోలిస్తే.. తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ డిసెంబర్‌ 31న రూ. 215.74 కోట్ల విలువైన మద్యం విక్రయాలను నమోదు చేసింది. ఏపీ విక్రయాలకు దాదాపు రెట్టింపు సంఖ్యలో తెలంగాణ ఆదాయం ఉండటం విశేషం.

డిసెంబర్‌ 31న ఒక్క హైదరాబాద్‌ 1, 2 డిపోలు వరుసగా రూ. 16.90 కోట్లు , రూ. 20.78 కోట్ల ఆదాయాన్ని నమోదు చేశాయి. 19 డిపోల్లో 2,17,444 కేసుల మద్యం విక్రయాలు జరగగా, 1,28,455 కేసుల బీరు విక్రయాలు జరిగినట్లు తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ తెలిపింది. జనవరి 1 ఆదివారం కావడంతో విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News