క్యాన్స‌ర్ ప్రారంభ సంకేతాలు ఇవే!

Update: 2022-10-15 04:58 GMT
అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన వ్యాధి.. క్యాన్స‌ర్‌. ప్ర‌పంచ‌వ్యాప్తంగానే కాకుండా మ‌న‌దేశంలోనూ క్యాన్స‌ర్ బారిన‌ప‌డి మ‌ర‌ణించేవారి సంఖ్య అత్య‌ధిక‌మే. మ‌హిళ‌లు, పురుషులు, పిల్ల‌లు అనే తేడా లేకుండా క్యాన్స‌ర్ అంద‌రినీ క‌బ‌ళిస్తోంది. వైద్య శాస్త్రం ఎంత‌గా అభివృద్ధి చెందినా క్యాన్స‌ర్ నుంచి మ‌నిషిని కాపాడ‌లేక‌పోతోంది. మ‌రి దీని నుంచి ర‌క్ష‌ణ ఎలా అంటే.. ప్ర‌జ‌లే త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. ప్రారంభంలోనే దీని ల‌క్ష‌ణాల‌ను గుర్తిస్తే సులువుగా క్యాన్స‌ర్‌ను అధిగ‌మించొచ్చు అంటున్నారు. ఒక వ్య‌క్తి క్యాన్స‌ర్ బారిన‌ప‌డ్డాడ‌ని కొన్ని ప్రారంభ సంకేతాలు ద్వారా తెలుసుకోవ‌చ్చ‌ని వివ‌రిస్తున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం... ప్రతి 10 మంది భారతీయులలో ఒకరు క్యాన్సర్ బారిన‌ప‌డుతున్నారు. అలాగే ప్ర‌తి 15 మంది భార‌తీయుల్లో ఒకరు క్యాన్స‌ర్‌తో క‌న్నుమూస్తున్నారు. నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక ప్ర‌కారం.. 2021లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 20.1 మిలియన్ కొత్త క్యాన్సర్ కేసులు వెలుగు చూశాయి. అదేవిధంగా  10.5 మిలియన్ల మంది క్యాన్సర్ తో మృతి చెందారు. ఈ క్యాన్స‌ర్ కేసుల సంఖ్య‌ 2040 నాటికి 29.5 మిలియన్లకు చేరుతుంద‌ని అంచ‌నా. అలాగే క్యాన్సర్ సంబంధిత మరణాల సంఖ్య 16.4 మిలియన్లకు పెరుగుతుందని వైద్య‌ నిపుణుల అంచ‌నాగా ఉంది.

ఇత‌ర క్యాన్స‌ర్ ర‌కాలు ఉన్న‌ప్ప‌టికీ.. మ‌హిళ‌ల్లో గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్‌, రొమ్ము క్యాన్స‌ర్‌, పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్స‌ర్‌లు అధికం. వీటితోనే ఎక్కువ మంది మ‌ర‌ణిస్తున్నారు. త‌మ‌కు క్యాన్స‌ర్ రాకూడ‌ద‌ని గ‌ర్భాశ‌యాలు, రొమ్ములు తొల‌గించుకునేవారి సంఖ్యా అధికంగానే ఉంది.

కాగా క్యాన్స‌ర్ ఆరంభ ల‌క్ష‌ణాల‌ను ఎలా తెలుసుకోవాలంటే చ‌ర్మం అసాధార‌ణంగా, అధికంగా పెరుగుతుండ‌టం, పుట్టు మ‌చ్చ‌ల ఆకృతి మారడం లేదా పెర‌గ‌డం, కొత్త‌గా పుట్టు మ‌చ్చ‌లు ఏర్ప‌డ‌టం, రొమ్ములు లేదా చంక‌ల‌లో గ‌డ్డ‌లు, చ‌ర్మ సంబంధిత వ్యాధులు, దుర‌ద వంటివాటి ద్వారా అనుమానించ‌వ‌చ్చ‌ని వైద్యులు చెబుతున్నారు.

అదేవిధంగా దీర్ఘ‌కాలంగా ఎడ‌తెరిపి లేని ద‌గ్గు ఉంటే అది ఊపిరితిత్తుల క్యాన్స‌ర్‌కు కార‌ణం కావ‌చ్చ‌ని చెబుతున్నారు. అలాగే ఆక‌లి త‌గ్గిపోవ‌డం, ఉన్న‌ట్టుండి బ‌రువు త‌గ్గిపోవ‌డం, శ్వాస ఆడ‌క‌పోవ‌డం త‌దిత‌ర ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నా క్యాన్స‌ర్ గా అనుమానించ‌వ‌చ్చ‌ని అంటున్నారు.

ముక్కులో దుర‌ద ఉంటే అది బ్రెయిన్ క్యాన్స‌ర్‌కు, జ‌న‌నేంద్రియాల వ‌ద్ద విప‌రీత‌మైన దుర‌ద‌, మ‌లంలో ర‌క్తం ప‌డ‌టం వంటివి ఉంటే ప్రేగు క్యాన్స‌ర్‌కు దారి తీయొచ్చ‌ని చెబుతున్నారు.
ఇక మూత్ర విసర్జన సమయంలో రక్తస్రావం, అధిక రక్త పోటు, కిడ్నీలో నొప్పి, దీర్ఘకాలిక బలహీనత... కిడ్నీ క్యాన్స‌ర్ ల‌క్ష‌ణాలు.

మాంసం ప‌ట్ల విర‌క్తి, త‌క్కువే తిన్న‌ప్ప‌టికీ క‌డుపు నిండిపోయిన‌ట్టు ఉండ‌టం, ర‌క్త‌హీన‌త‌, క‌డుపులో అసంక‌ల్పిత కద‌లిక‌లు... క‌డుపు క్యాన్స‌ర్ లక్ష‌ణాలు.

దీర్ఘ‌కాలంగా గొంతు నొప్పి, శ్వాస తీసుకోవ‌డంలో, వ‌ద‌ల‌డంలో ఇబ్బంది, గొంతులో గ‌డ్డ‌లా అనిపించ‌డం, ర‌క్తంతో కూడిన ద‌గ్గు, నోటి దుర్వాస‌న వంటి ల‌క్ష‌ణాలు ఉంటే అది స్వ‌ర‌పేటిక క్యాన్స‌ర్ కావ‌డానికి ఆస్కారం ఉంటుంద‌ని చెబుతున్నారు.

అయితే ఈ ల‌క్ష‌ణాలు పూర్తిగా ఆయా క్యాన్స‌ర్ల‌కు మాత్ర‌మే సంబంధిన‌వి అనుకోవ‌డానికి వీల్లేదు. ఇత‌ర శారీర‌క భాగాల‌తో వ‌ల్ల త‌లెత్తే సాధార‌ణ స‌మ‌స్య‌లు కూడా అయిఉండొచ్చ‌ని వైద్యులు చెబుతున్నారు. అయితే ప్ర‌జ‌లు ప్రారంభంలో ఇలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపించిన‌ప్పుడే ఎంత అప్ర‌మ‌త్తంగా ఉంటే అంత మంచిదంటున్నారు. ఆరంభంలోనే స‌రైన వైద్య ప‌రీక్ష‌లు చేయించుకుంటే క్యాన్స‌ర్ బారి నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చ‌ని సూచిస్తున్నారు.

ఈ పైన పేర్కొన్న లక్షణాలు ఏమైనా క‌నిపిస్తే వాటిని అశ్ర‌ద్ధ చేయ‌కుండా వెంట‌నే వైద్యుడిని సంప్ర‌దించాల‌ని సూచిస్తున్నారు. అయితే 90 శాతం మంది ప్రజలు క్యాన్సర్ ప్రారంభ సంకేతాలను విస్మరిస్తున్నార‌ని అంటున్నారు. క్యాన్స‌ర్ బాగా ముదిరిపోయిన ద‌శ‌లో, అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో వైద్యుల‌ను సంప్ర‌దిస్తుండ‌టంతో వారిని కాపాడ‌టం క‌ష్ట‌మ‌వుతోంద‌ని చెబుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News