క‌రోనాతో ఆట‌లా.. ర‌ఫ్ఫాడుకుంటోంది

Update: 2020-06-25 01:30 GMT
క‌రోనా ప్ర‌భావం కొంచెం త‌గ్గింద‌ని.. కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుని మ్యాచ్‌లు ఆడేద్దామ‌ని క్రీడాకారులు సిద్ధ‌మ‌వుతుంటే.. న‌న్నంత తేలిగ్గా తీసుకుంటారా అన్న‌ట్లుగా కరోనా మ‌హ‌మ్మారి ప‌డ‌గ విప్పుతోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రీడాకారుల్ని వ‌ణికిస్తూ ఈ వైర‌స్ ఒక్క‌సారిగా విజృంభించింది. ఇటు టెన్నిస్‌లో, అటు క్రికెట్లో ఒక్క‌సారిగా ప్ర‌ముఖ క్రీడాకారులకు క‌రోనా వైరస్ బ‌య‌ట‌ప‌డ‌టంతో క్రీడా ప్ర‌పంచం షేక్ అయిపోతోంది. ప్ర‌పంచ నంబ‌ర్‌వ‌న్ టెన్నిస్ ఆట‌గాడు నొవాక్ జ‌కోవిచ్ సార‌థ్యంలో నిర్వ‌హించిన ఎగ్జిబిష‌న్ టెన్నిస్ టోర్న‌మెంట్లో అస‌లేమాత్రం క‌రోనా అంటే భ‌యం లేకుండా.. ఏ జాగ్ర‌త్త‌లూ పాటించ‌కుండా నిర్లక్ష్యం వ‌హించ‌డంతో క‌రోనా విజృంభించింది.

జ‌కోవిచ్, దిమిత్రోవ్ లాంటి అగ్ర‌శ్రేణి క్రీడాకారుల‌తో పాటు ఇంకో ఇద్ద‌రు ఆట‌గాళ్లు క‌రోనా బారిన ప‌డ్డారు. టోర్నీలో పాల్గొన్న అంద‌రికీ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తుండ‌టంతో మ‌రింత మంది బాధితులు తేలే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఆగ‌స్టులో యుఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ నిర్వ‌హించేందుకు స‌న్నాహాలు చేస్తున్న టెన్నిస్ వ‌ర్గాల‌కు ఇది పెద్ద షాకే. మ‌రోవైపు పాకిస్థాన్ క్రికెట్‌ను క‌రోనా కుదిపేస్తోంది. వ‌చ్చే నెల‌లో ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు ఆ జ‌ట్టు సిద్ధ‌మ‌వుతుండ‌గా.. ఆ సిరీస్ కోసం ఎంపిక చేసిన ప‌ది మంది క్రికెట‌ర్లు క‌రోనా బారిన ప‌డ్డ‌ట్లు తేలింది. నిన్న షాదాబ్ ఖాన్‌, హైద‌ర్ అలీ, ర‌వూఫ్ అనే ముగ్గురు క్రికెట‌ర్ల‌కు క‌రోనా ఉన్న‌ట్లు తేల‌గా.. బుధ‌వారం ఏకంగా మ‌రో ఏడుగురు క‌రోనా బాధితులు గా తేలారు. అందు లో మ‌హ్మ‌ద్ హ‌ఫీజ్‌, రియాజ్ ఖాన్, ఫ‌ఖ‌ర్ జ‌మాన్ లాంటి ప్ర‌ముఖ ఆట‌గాళ్లున్నారు. ఈ నేప‌థ్యం లో ఇంగ్లాండ్‌ లో పాకిస్థాన్ ప‌ర్య‌ట‌నే ప్ర‌మాదం లో ప‌డింది. ఈ ప‌రిణామాలు మిగ‌తా క్రీడ‌ల వాళ్ల‌ను కూడా ఆందోళ‌న‌ లోకి నెడుతున్నాయి.
Tags:    

Similar News