రాహుల్ యాత్ర‌కు అప్పుడే ఇబ్బందులు!

Update: 2022-09-21 09:30 GMT
2024లో జ‌రిగే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి విజ‌యం సాధించి పెట్ట‌డ‌మే ల‌క్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్ర‌స్తుతం భార‌త్ జోడో యాత్ర చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ యాత్ర కేర‌ళ‌లో కొన‌సాగుతోంది. ఆ రాష్ట్రంలో సెప్టెంబ‌ర్ 11న మొద‌లైంది. మ‌రో 8 రోజులు ఈ యాత్ర కేర‌ళ‌లో కొన‌సాగుతుంది. ఆ త‌ర్వాత క‌ర్ణాట‌క‌లోకి ప్ర‌వేశిస్తుంది.

ఈ నేప‌థ్యంలో భార‌త్ జోడో యాత్ర‌ను నియంత్రించాల‌ని కోర్టులో ఒక న్యాయ‌వాది పిటిష‌న్ దాఖ‌లు చేశారు. రాహుల్ గాంధీ జాతీయ ర‌హ‌దారుల‌పై యాత్ర చేస్తుండ‌టంతో ట్రాఫిక్ ఇబ్బందులు త‌లెత్తుతున్నాయ‌ని త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు. యాత్ర కోసం జాతీయ ర‌హ‌దారిపై గంట‌ల త‌ర‌బ‌డి ట్రాఫిక్ ఆపేశార‌ని.. దీంతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ఆ లాయ‌ర్ త‌న పిటిష‌న్‌లో కోర్టు దృష్టికి తెచ్చారు.

రాహుల్ గాంధీ పాద‌యాత్ర‌ను జాతీయ ర‌హ‌దారిపై ఒక ప‌క్క‌గా చేసుకునేలా ఆదేశాలివ్వాల‌ని కోరారు. రోడ్డంతా పాద‌యాత్ర చేస్తుండ‌టంతో ట్రాఫిక్ ఆగిపోయి సామాన్య ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని విజ‌య‌న్ అనే న్యాయ‌వాది కేర‌ళ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

అలాగే జోడో యాత్ర భ‌ద్ర‌త‌కు, ఏర్పాట్ల‌కు భారీగా ఖ‌ర్చు చేస్తున్నార‌ని, ఇందుకోసం వంద‌లాది మంది పోలీసుల‌ను రోడ్డుపై మోహ‌రిస్తున్నార‌ని న్యాయ‌వాది త‌న పిటిష‌న్‌లో ఆరోపించాడు. ప్ర‌జ‌లు ప‌న్నుల రూపంలో క‌ట్టిన ప్ర‌జాధ‌నాన్ని ఈ యాత్ర‌కు ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేస్తోంద‌ని ఆరోపించారు.

ఈ యాత్ర‌కు అయ్యే ఖ‌ర్చుల‌ను కాంగ్రెస్ పార్టీ భ‌రించేలా ఆదేశాలు ఇవ్వాల‌ని కోరారు. ఈ యాత్ర కేరళ ప్రజా రోడ్డు రవాణా చట్టం 2011ని ఉల్లంఘిస్తోందని కూడా విజయన్ పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై కోర్టు సెప్టెంబ‌ర్ 22న‌ విచారణ చేపట్టనుంది.

మ‌రోవైపు తాము ముందస్తుగా అన్ని అనుమతులు తీసుకునే యాత్ర సాగిస్తున్నామని కాంగ్రెస్ ఎంపీ కొడికున్నిల్ సురేష్ తెలిపారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. రాహుల్‌గాంధీకి భద్రతా కారణాల వల్ల కొన్ని చోట్ల పోలీసులే రోడ్లను బ్లాక్ చేస్తున్నారని వెల్ల‌డించారు. యాత్ర‌కు సంబంధించి ఇప్ప‌టికే రాబోయే 157 రోజుల్లో యాత్ర సాగే మొత్తం 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ముందస్తు అనుమతి తీసుకున్నామ‌ని చెప్పారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News