కేసీఆర్ టికెట్ ఇస్తే బెజ‌వాడ నుంచి పోటీ చేస్తాడ‌ట‌!

Update: 2019-03-12 05:16 GMT
నిద్ర లేచింది మొద‌లు ప‌డుకునే వ‌ర‌కూ ఏ మాత్రం అవ‌కాశం చిక్కినా ఆంధ్ర పాల‌కులు.. ఆంధ్రా ప్రాంత ప్ర‌భుత్వాలు అంటూ తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టేసే కేసీఆర్ కు తెలంగాణ త‌ప్పించి ఆంధ్రా ప్రాంతంపైనా.. ఆంధ్రా ప్ర‌జ‌ల మీద ప్ర‌త్యేకంగా ఎలాంటి ప్రేమ‌.. అభిమానం లేదు. ఆ విష‌యాన్ని ఆయ‌నే నేరుగా చెప్పేస్తుంటారు. కాకుంటే.. కాస్త తెలివిగా వ్య‌వ‌హ‌రిస్తూ తాను తిట్టే ఆంధ్రా ప‌దం ఆంధ్రా నాయ‌కుల‌ను ఉద్దేశించే త‌ప్పించి ఆంధ్రోళ్ల‌ను ఉద్దేశించి మాత్రం కాదంటూ తెలివిగా క‌వ‌ర్ చేస్తుంటారు.

ఒక రాష్ట్రాన్ని రెండు ముక్క‌లు చేసిన అధినేత‌ను.. బాధిత ప్రాంతానికి చెందిన వారు అభిమానించే చిత్ర‌మైన ప‌రిస్థితి ఒక్క ఆంధ్రాలోనే క‌నిపిస్తుందేమో. విడిపోవ‌టం త‌ప్పు అని చెప్ప‌టం లేదు కానీ.. విడిపోయిన తీరు.. విడిపోయే క్ర‌మంలో రెండు రాష్ట్రాల మ‌ధ్య జ‌రిగిన ఆస్తుల పంపిణీతో పాటు.. క‌ష్టాలు.. న‌ష్టాలు ఆంధ్రాకి.. సుఖాలు.. సౌక‌ర్యాలు తెలంగాణ‌కు అన్న‌ట్లుగా సాగిన విభ‌జ‌న‌పై ప‌లువురు ఆంధ్రోళ్లు ఆగ్ర‌హంతో ఉన్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

హైద‌రాబాద్ మీద ప్ర‌త్యేక‌మైన ఇష్టం కేవ‌లం.. రాజ‌ధాని అన్న ఉద్దేశ‌మే త‌ప్పించి.. అక్క‌డి సంప‌ద మీద కానీ మ‌రో దాని మీద కానీ కాద‌న్న విష‌యం వాస్త‌వం. అయినప్ప‌టికీ ఆ విష‌యాన్ని త‌ప్పుగా ప్ర‌చారం చేయ‌టంలో కేసీఆర్ స‌క్సెస్ అయ్యార‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తూ ఉంటుంది.

ఎక్క‌డైనా.. ఏ రాష్ట్రంలో అయినా విడిపోవ‌టానికి త‌హ‌త‌హ‌లాడే ప్రాంతం న‌ష్ట‌పోతుంది. కానీ.. తెలంగాణ విష‌యంలో మాత్రం అందుకు భిన్నం. దీనికి కార‌ణం ఆంధ్రాకు చెందిన నేత‌లు.. వారి నాయ‌క‌త్వాలు. క‌ల‌లో కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన నేత‌లు ఆంధ్రా ప్రాంతానికి అనుకూలంగా.. వారికి మేలు జ‌రిగే అంశం మీద క‌లిసి నిర్ణ‌యం తీసుకోవాల‌న్న ఆలోచ‌న చేయ‌రు.

ఈ రోజున ఏపీకి కేసీఆర్ వ‌స్తున్నారంటే పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు సిద్ధం చేసే ఆంధ్రా అభిమానులు ఉన్నారు. కానీ.. అలాంటి ప‌నే ఆంధ్రా ప్రాంతానికి చెందిన నేత విష‌యంలో తెలంగాణ‌లో ఎవ‌రూ ఉండ‌ర‌న్న‌ది క‌ఠిన వాస్త‌వం. కేసీఆర్ మీద ఉండే క్రేజ్ ఆంధ్రాప్రాంతానికి చెందిన కొంద‌రిలో కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తూ ఉంటుంది.

దీనికి త‌గ్గ‌ట్లే తాజాగా విజ‌య‌వాడ‌కు చెందిన కొణిజేటి ఆదినారాయ‌ణ అనే వ్య‌క్తి ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న చేశాను. తాను బెజ‌వాడ బ‌రిలో దిగాల‌ని అనుకుంటున్నాన‌ని.. అయితే టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ త‌న‌కు టికెట్ ఇస్తే టీఆర్ ఎస్ పార్టీ త‌ర‌ఫున పోటీ చేస్తాన‌ని చెబుతున్నారు. కేసీఆర్ అంటే ఆయ‌న‌కున్న భ‌క్తిని.. ప్రేమ‌ను ప‌లువురు ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావిస్తుంటారు. 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ విజ‌యంసాధిస్తే బెజ‌వాడ దుర్గ‌మ్మ‌కు 101 కొబ్బ‌రికాయ‌లు కొడ‌తాన‌ని మొక్కుకోవ‌ట‌మేకాదు.. టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత మోకాళ్ల‌పైన ఇంద్ర‌కీలాద్రి ఎక్కారు.

కేసీఆర్ ను విప‌రీతంగా అభిమానించే ఆయ‌న‌... విజ‌య‌వాడ సెంట్ర‌ల్ స్థానం నుంచి పోటీకి రెఢీ అవుతున్నారు. ఇదే విష‌యాన్ని టీఆర్ఎస్ నాయ‌కత్వానికి ఇప్ప‌టికే తెలియ‌జేసిన‌ట్లు చెబుతున్నారు. మ‌రి.. దీనికి కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. త‌న‌కు కానీ టికెట్ ఇస్తే.. ఎన్నిక‌ల ప్ర‌చారానికి కేటీఆర్ ను తీసుకొస్తాన‌ని ఆయ‌న చెబుతున్నారు. ఆంధ్రా నుంచి తెలంగాణ విడిపోవ‌టానికి కార‌ణ‌మైన పార్టీ ఈ రోజున ఏపీలో పోటీ చేసి.. ఎలాంటి సందేశం ఇస్తుంది?  అస‌లు ఇది సాధ్య‌మా? అన్న‌ది ప‌క్క‌న పెడితే.. టీఆర్ఎస్ టికెట్ కోసం ఆంధ్రా ప్రాంతం నుంచి ఒక‌రు ఆస‌క్తిగా ఎదురుచూడటం మాత్రం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.


Tags:    

Similar News