ఇద్ద‌రు అల్లుళ్లూ పోటీ!... బాల‌య్య‌కు టికెట్ క‌ష్ట‌మే!

Update: 2019-02-13 11:50 GMT
టీడీపీ వ్వ‌వ‌స్థాప‌కుడు స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు త‌న‌యుడు, టాలీవుడ్ అగ్ర‌హీరో, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ‌కు ఇప్పుడు వింత ప‌రిస్థితి ఎదుర‌వుతున్న‌ట్లుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. చాలా కాలం నుంచి టీడీపీలో యాక్టివ్‌గానే ఉన్న బాలయ్య‌... గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో త‌న తండ్రి ఎన్టీఆర్‌ కు అచ్చి వ‌చ్చిన హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా బ‌రిలోకి దిగారు. ఎన్టీఆర్ త‌నయుడిగా ఎంట్రీ ఇచ్చిన బాల‌య్య‌ను అక్క‌డి జ‌నం బాగానే ఆద‌రించారు. మంచి మెజారిటీతో గెలిపించారు. అయితే ఆ త‌ర్వాత బాల‌య్య వ్య‌వ‌హార స‌ర‌ళితో అక్క‌డి జ‌నం బాగానే ఇబ్బంది ప‌డ్డారు. నియోజ‌క‌వ‌ర్గంపై ప‌ట్టు కోల్పోయార‌ని బాల‌య్య‌పై పెద్ద ఎత్తున సెటైర్లు ప‌డ్డాయి. ఎమ్మెల్యే బాల‌య్యే అయినా... ఆయ‌న నియ‌మించుకున్న పీఏలు అక్క‌డ చ‌క్రం తిప్పి పార్టీ ప‌రువును తీసేలా వ్య‌వ‌హ‌రించిన తీరు నాడు వైర‌ల్‌గా మారింది. పీఏల‌ను నిలువ‌రించలేక‌పోయిన బాల‌య్య‌... ఇక ప్ర‌జ‌ల‌నేం ఉద్ధ‌రిస్తార‌ని కూడా ఇప్పుడు కొత్త వాద‌న‌లు వినిపిస్తున్నాయి. అదే స‌మ‌యంలో ఇక బాల‌య్య ప‌ని అయిపోయింద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాల‌య్య‌కు టికెట్ కూడా కష్ట‌మేన‌ని కూడా వార్త‌లు వెలువ‌డ్డాయి.

ఇలాంటి కీల‌క త‌రుణంలో మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం నేడు చోటుచేసుకుంది. బాల‌య్య చిన్న‌ల్లుడు భ‌ర‌త్.... తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్నాన‌ని, ఇందుకు టీడీపీ అధిష్ఠానం స‌హ‌క‌రించాల్సి ఉంద‌ని సంచల‌న ప్ర‌క‌ట‌న చేశారు. బాల‌య్య చిన్న‌ల్లుడిగానే మ‌న‌కు తెలిసిన భ‌ర‌త్‌... టీడీపీ సీనియర్ నేత‌, దివంగ‌త ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తికి స్వ‌యానా మ‌న‌వ‌డు. గీతం వ‌ర్సిటీ చైర్మ‌న్ కూడా అయిన మూర్తి ఇటీవ‌లే మ‌ర‌ణించారు. ఈ క్ర‌మంలో మూర్తి స్థానంలో గీతం చైర్మ‌న్ గిరీని చేజిక్కించుకున్న భ‌ర‌త్‌... త‌న తాత‌య్య రాజకీయ వార‌స‌త్వాన్ని కూడా అందిపుచ్చుకోవాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు.  ఈ క్ర‌మంలోనే నేడు విశాఖ‌లో మీడియాతో మాట్లాడిన భ‌ర‌త్‌... తాను రాజ‌కీయాల్లోకి దిగేసిన‌ట్టేన‌ని ప్ర‌క‌టించారు. పార్టీ అదేశిస్తే... వ‌చ్చే ఎన్నిక‌ల్లో విశాఖ పార్ల‌మెంటు సీటు నుంచి పోటీ చేసేందుకు కూడా సిద్ధంగానే ఉన్న‌ట్లు కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు. సో... విశాఖ సీటు దాదాపుగా భ‌ర‌త్‌కు క‌న్‌ఫార్మ్ అయిన‌ట్టే లెక్క‌.

ఇక మొన్న ఎమ్మెల్సీగా దొడ్డిదారిన చ‌ట్ట‌స‌భ‌ల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాల‌య్య పెద్ద‌ల్లుడు, చంద్ర‌బాబు ఒక్క‌గానొక్క కుమారుడు నారా లోకేశ్... ఈ ఎన్నిక‌ల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయ‌డం ఖాయ‌మే. అంటే... బాల‌య్య ఇద్ద‌రు అల్లుళ్లు కూడా ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో పోటీకి దిగుతున్న‌ట్లేన‌న్న‌మాట‌. ఇక బాల‌య్య బావ‌గారైన చంద్ర‌బాబు కూడా ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాల్సిందే క‌దా. మ‌రి బాల‌య్య‌కు కూడా టికెట్ ఇస్తే... బాబు, బాల‌య్య‌ల కుటుంబాల నుంచే ఏకంగా న‌లుగురు పోటీకి దిగుతున్న‌ట్లు లెక్క తేలుతుంది. సామాజిక వ‌ర్గ స‌మీక‌ర‌ణాల ప్ర‌కారం చూసుకుంటే... క‌మ్మ  సామాజిక వ‌ర్గం నుంచి అది కూడా ఒకే ఫ్యామిలీకి నాలుగు టికెట్లు కేటాయించ‌డం అంటే ఇత‌ర సామాజిక వ‌ర్గాల‌కు రాంగ్ మెసేజ్ పంపిన‌ట్టే. ఈ లెక్క‌న ఈ ద‌ఫా బాల‌య్య‌ను ప్ర‌త్య‌క్ష బ‌రికి దూరంగా పెట్టేసి... ఎన్నిక‌లు ముగిసి టీడీపీ అధికారంలోకి వ‌స్తే... ఏ ఎమ్మెల్సీనో, ఏ రాజ్య‌స‌భ సీటో ఇచ్చేస్తే స‌రిపోలా? అన్న కోణంలో చంద్ర‌బాబు ఆలోచిస్తున్నార‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News