`కేపీజేపీ`కి ఉపేంద్ర గుడ్ బై...త్వ‌ర‌లో కొత్త‌పార్టీ!

Update: 2018-03-06 12:58 GMT
హీరో ఉపేంద్ర ....కొద్ది రోజుల క్రితం కర్ణాటక ప్రజ్ఞావంతర జనతా పార్టీ (కర్ణాటక ప్రతిభావంతుల జనతా పార్టీ)ని స్థాపించిన సంగ‌తి తెలిసిందే. క‌ర్ణాట‌క‌లో రాజ‌కీయ నాయ‌కులు ఇచ్చే డ‌బ్బులు తీసుకొని....ఓటు మాత్రం వారికి వేయొద్ద‌ని ఉపేంద్ర...ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన పిలుపు వివాదాస్ప‌ద‌మైన సంగ‌తి తెలిసిందే. త‌న‌ పార్టీకి సంబంధించిన‌ కార్యక్రమాలు - త‌న రాజకీయ పర్యటనల వివరాల‌ను తెలియ‌జేస్తూ 'కేపీజేపీఉప్పి` పేరుతో ఓ వెబ్ సైట్ ను కూడా ఉపేంద్ర ప్రారంభించారు. 2018లో జ‌ర‌గ‌బోతోన్న ఎన్నిక‌ల్లో కర్ణాటకలోని 224 శాసన సభ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ప్ర‌క‌టించారు. పోటీ చేసేందుకు ఆస‌క్తి ఉన్న వారు ఆ వెబ్ సైట్ లో వివరాలు న‌మోదు చేయాల‌ని కోరారు. అయితే, అనూహ్యంగా ఉపేంద్ర .....కేపీజేపీకి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించి షాక్ ఇచ్చారు. తనతో పాటు తన మద్దతుదారులు - నాయకులు రాజీనామా చేస్తున్నామని - ఇక నుంచి ఆ పార్టీతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్ర‌క‌టించ‌డం రాష్ట్ర‌మంత‌టా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

కేపీజేపీ కూడా మిగిలిన రాజ‌కీయ పార్టీల్లా కాకూడ‌ద‌ని - అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు ఇష్టం లేక‌నే తాను త‌ప్పుకుంటున్నాన‌ని ఉపేంద్ర అన్నారు. తాను రాజ‌కీయాల్లో పిల్లాడిన‌ని - త్వరలో తన‌ భవిష్యత్తును అభిమానులే నిర్ణయిస్తారని చెప్పారు. తాను బీజేపీలో చేర‌బోతున్నాన‌ని వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌న్నారు. కేపీజేపీ వ్యవస్థాపకుడు మహేష్ గౌడతో వ‌చ్చిన విభేదాల కార‌ణంగానే ఉపేంద్ర ఆ పార్టీకి రాజీనామా చేశారు. త‌న సిద్ధాంతాలు న‌చ్చి త‌న‌ను ఆ పార్టీ అధ్య‌క్షుడిగా మ‌హేష్ నియ‌మించార‌ని, అందుకు త‌గ్గ‌ట్లే రాబోయే ఎన్నిక‌ల్లో అభ్యర్థులను సిద్ధం చేశామ‌ని, ఇప్పుడు వేరే అభ్యర్థులను బరిలో దింపాలని మ‌హేష్ డిమాండ్ చేస్తున్నారని ఉపేంద్ర అన్నారు. తాను పార్టీ ఫండ్ వసూలు చెయ్య‌న‌ని ముందే చెప్పాన‌ని - ఇపుడు వ‌సూలు చేయాల‌ని మ‌హేష్ కోరార‌ని - త‌న‌కు ఇష్టంలేకే బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని అన్నారు. ఏపార్టీలో చేరే ఉద్దేశం త‌న‌కు లేద‌ని, తన సిద్దాంతాలకు అనుగుణంగా సొంత పార్టీని స్థాపిస్తానని అన్నారు. తమ కొత్త పార్టీ త‌ర‌ఫున‌ 200 మంది అభ్యర్థులు పోటీ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. త్వరలో తన తదుపరి కార్యచరణ ప్రకటిస్తానని చెప్పారు. బీజేపీలో ఉపేంద్ర చేరేందుకు త‌మ‌కు అభ్యంతరం లేదని కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి - బీజేపీ ఎమ్మెల్యే ఆర్. అశోక్ చెప్పారు.


Tags:    

Similar News