యూట్యూబ్ లో చూడటం ...బైక్స్ చోరీ చేయడం !

Update: 2021-01-30 11:30 GMT
నెట్ వాడకం పెరిగిన తర్వాత  యూట్యూబ్‌ చూసి, దొంగతనాలు చేసే ద్విచక్ర వాహన చోరుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ప్రధానంగా మొదటిసారి నేరాలు చేస్తున్న వారు పెరిగారని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల పట్టుబడ్డ వాహన దొంగలు పోలీసు విచారణలో యూట్యూబ్‌, ఆన్ ‌లైన్‌ లో చూసి, చోరీలకు పాల్పడినట్లు వెల్లడించడం గమనార్హం. సులభంగా ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తే.. వాటిని కొనేవారు  కూడా కోకొల్లలుగా ఉండడంతో కొత్త నేరస్థులు పుట్టుకొస్తున్నారు. లాక్‌ డౌన్‌ తర్వాత ఉపాధులకు గండి పడడంతో.. ఆ కోవలో ఉన్నవారు బైక్‌ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

కాలనీల్లో పుట్టగొడుగుల్లా ఉండే ఇళ్లలో పార్కింగ్‌ సదుపాయాలు లేకపోవడంతో.. చాలా మంది వాహనదారులు తమ బైక్‌ లను ఇంటి బయటే పార్క్‌ చేస్తున్నారు. ఇది దొంగలకు అవకాశంగా మారుతోందనే వాదనలు ఉన్నాయి. ద్విచక్ర వాహనం హ్యాండిల్‌ లాక్‌ తీసేశాక.. బీజీ యూనిట్‌లో ఏ కేబుల్ ‌ను పీకేస్తే.. తాళం చెవి లేకుండానే బండిని ఎలా స్టార్ట్‌ చేయొచ్చు, నేరాలకు ప్రేరేపించే ఇలాంటి సమాచారం ఇప్పుడు నెట్టింట సులభంగా లభిస్తోంది. ఆ వీడియో లు చూసి చాలా ఈజీగా బైక్స్ ను దొంగలిస్తున్నారు.  ఒకప్పుడు దొంగలు మారు తాళం చెవులను ఉపయోగించి, ద్విచక్రవాహనాలను తీసుకెళ్లేవారు. ఇప్పుడు వస్తున్న వాహనాల్లో హ్యాండిల్‌ లాక్‌ వ్యవస్థ అంత పకడ్బందీగా ఉండడం లేదు. హ్యాండిల్‌ను బలంగా మరోవైపు తిప్పితే లాక్‌ విరిగిపోతుంది.

ఏ సర్క్యూట్‌ ను తొలగిస్తే.. బైక్‌ ను కిక్‌ కొట్టి స్టార్ట్‌ చేయొచ్చు, ఏయే వైర్లను కలిపితే బండి సెల్ఫ్‌ స్టార్ట్‌ అవుతుంది.  అనే విషయాలను యూట్యూబ్‌లోని కొన్ని వీడియోలు పూసగుచ్చినట్లు చూపిస్తున్నాయి. హ్యాండిల్‌ లాక్‌ బైక్ ‌ను ఎంతమాత్రం కాపాడలేదని, యాంటీ థెఫ్ట్‌ అలారం  అమర్చుకోవడం ఉత్తమమని హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ లోని ఆటోమొబైల్‌ టీమ్‌ అధికారి ఒకరు తెలిపారు. అలాగే హైదరాబాద్‌ లాంటి నగరాల్లో జాయ్‌ రైడర్‌ సంస్కృతి పెరిగిపోయింది. అంటే నిందితులు పార్క్‌ చేసిన వాహనాన్ని సులభంగా తస్కరిస్తారు. తమ గమ్యస్థానం చేరేవరకు, లేదా పెట్రోల్‌ అయిపోయే వరకు ఆ వాహనాన్ని నడుపుతారు. తర్వాత రోడ్డు పక్కనో.. రైల్వేస్టేషన్లు, బస్ ‌స్టేషన్లలోని పార్కింగ్‌ లాట్లలోనో వదిలిపెట్టి వెళ్లిపోతారు. ఈ తరహా కేసులు ఇప్పటికే నగరంలో ఎన్నో నమోదు అయ్యాయి.
Tags:    

Similar News